ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ రాష్ట్రాన్ని అవినీతిరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో ముందడుగు వేస్తున్నారు.. తొలి కేబినెట్ భేటీ సమావేశంలోనే అవినీతిని ఏ స్థాయిలోనూ ఉపేక్షించేది లేదని, అవినీతికి పాల్పడితే ఎంతటి సీనియర్ నేత అయినా వెంటనే తీసిపడేస్తా అని హెచ్చరించారు. అంతే కాదు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఎవరైనా సరే..అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సంకేతాలు ఇచ్చాడు. అంతే కాకుండా గత ఐదేళ్ల టీడీపీ హయాంలో పోలవరంతో సహా, పలు సాగునీటి ప్రాజెక్టులు, ప్రభుత్వ పనుల్లో జరిగిన అవినీతిని గుర్తించిన సీఎం జగన్.. రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడం ద్వారా ప్రజల డబ్బును ఆదా చేస్తున్నారు. ఇప్పటి వరకు రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి 1200 కోట్లకు పైగా ప్రజా ధనం ఆదా అయింది. మరోవైపు ప్రభుత్వ శాఖల్లో అవినీతిని నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు రాష్ట్రంలో ప్రతివారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం ద్వారా వస్తున్న ఫిర్యాదుల్లో ఎక్కువగా అధికారుల అవినీతికి సంబంధించినవే ఉండడం చూసి ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ శాఖల్లో అధికారుల అవినీతిని కట్టడి చేసి, రాష్ట్రాన్ని అవినీతిరహితంగాతీర్చిదిద్దేందుకుగాను ఏసీబీకి పూర్తి అధికారాలు ఇచ్చారు. ముందుగా ఏసీబీకి పూర్తి స్థాయి సిబ్బందితో బలపేతం చేసి, రెండు, మూడు వారాల్లో పెద్ద ఎత్తున దాడులు నిర్వహించాలని సీఎం జగన్ నిర్ణయించారు. దీంతో అవినీతిపరుల గుండెల్లో వణుకు మొదలైంది. అవినీతికి పాల్పడితే ఏ స్థాయి వారైనా ఉపేక్షించవద్దని..సీఎం జగన్ ఏసీబీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇలా అవినీతి నిర్మూలన కోసం ప్రయత్నిస్తున్న సీఎం జగన్‌పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ప్రశంసల వర్షం కురిపించారు. తెలుగు రాజకీయాల్లో నిర్మొహమాటంగా కుండబద్ధలు కొట్టినట్లు విమర్శించే నాయకుల్లో ఉండవల్లి ముందు వరుసలో ఉంటారు. వైయస్ రాజశేఖర్ తనయుడిగా వ్యక్తిగతంగా జగన్‌ను అభిమానించే ఉండవల్లి కొన్ని అంశాల్లో వైసీపీ ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు కూడా. అయితే తాజాగా అవినీతి నిర్మూలన విషయంలో ఉండవల్లి సీఎం జగన్‌ను అభినందించారు. రాష్ట్రంలో అవినీతిని జగన్ బాగా అదుపులో ఉంచగలిగారని, ప్రస్తుతానికి అవినీతి నియంత్రణ పై స్థాయిలోనే ఉన్నప్పటికి…త్వరలోనే కింది స్థాయిలో కూడా ఉండదని ఉండవల్లి స్పష్టం చేశారు. అలాగే ప్రస్తుతం ఏపీలో సీఎం జగన్ ఆధ్వర్యంలో ఏసీబీ చురుకుగా పని చేస్తుందని ఆయన అన్నారు. కాగా మరోవైపు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని, వైసీపీ నేతలు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారంటూ..తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అయితే నిజాలను నిర్భయంగా మాట్లాడే ఉండవల్లి.. రాష్ట్రంలో అవినీతి బాగా కంట్రోల్ అయిందని ప్రశంసలు కురిపించడంతో.. బాబు, పవన్‌లు కావాలనే జగన్ సర్కారుపై బురద జల్లుతున్నారని అర్థమవుతోంది.. మొత్తంగా అవినీతి నియంత్రణ విషయంలో సీఎం జగన్‌పై ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
