గిరిజన సహకార సంస్థ(జీసీసీ)ను లాభాల బాటలో తీసుకొచ్చేందుకు జీసీసీ ఉత్పత్తులను మరిన్ని పెంచాలని, నాణ్యతలో నెంబర్ వన్ స్థానంలో ఉండాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ , స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు. జీసీసీ పనితీరు, భవిష్యత కార్యాచరణపై గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా జడ్ చోంగ్తు, అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి, ఇతర అధికారులతో మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ బుధవారం దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లోని మంత్రి చాంబర్ లో సమీక్ష చేశారు.
స్థానిక గిరిజన యువతకు స్వయం ఉపాధి అవకాశాలు లభించేలా గిరిజన సహకార సంస్థను బలోపేతం చేయాలని మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ సూచించారు.అటవీ ఉత్పత్తుల సేకరణ, అమ్మకంతో పాటు గిరిజన ప్రాంతాలలో ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారా గిరిజన సహకార సంస్థను ఈ సంవత్సరం దాదాపు 300 కోట్ల టర్నోవర్ తీసుకెళ్లే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు కమిషనర్ క్రిస్టినా వివరించారు. అదేవిధంగా జీసీసీ ఉత్పత్తులు మార్కెట్ లో లభించే వాటికంటే నాణ్యతలో అత్యంత ఉత్తమ శ్రేణి కలిగినవని, వీటికి ఏ1 గుర్తింపు వచ్చిందని తెలిపారు.
గిరిజన హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలు, ఇతర రెసిడెన్షియల్ పాఠశాలలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు జీసీసీ ఉత్పత్తులు పంపిణీ చేస్తున్నామని, వారి నుంచి మంచి స్పందన ఉందన్నారు. ఐటిడిఏ పరిధిలో జీసీసీ ఆధ్వర్యంలో సబ్బుల తయారీ సంస్థలు మరిన్ని పెంచుతున్నామని, అదేవిధంగా ఈ సంవత్సరం దోమ నివారణ మందును, లిప్ బామ్, అల్లోవెర జెల్ వంటి ఉత్పత్తులు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. జీసీసీ ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతాల్లో పెట్రోల్ బంక్స్ ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని, స్థానిక గిరిజన రైతులనుంచి ముడి సరుకులు తీసుకుని మిల్లెట్స్, చిక్కీల వంటి అనేక వ్యవసాయ సంబంధ ఉత్పత్తులు పెంచి, వాటిని అమ్మేందుకు స్థానిక గిరిజనులకు ఉపాధి కల్పించే ఆలోచన చేస్తున్నామని మంత్రి గారికి వివరించారు.
గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్య రంగాల్లో ఆర్ధిక సాయం చేసేందుకు కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కార్పోరేట్ సంస్థలు ముందుకు వస్తున్నాయని తెలిపారు. ఏటూరు నాగారం ఐటిడీఏలో 10 కోట్ల రూపాయల ఆర్ధిక సాయం చేయడానికి కార్పోరేట్ కంపెనీ ముందుకు వచ్చిందన్నారు. అదేవిధంగా మిగిలిన ఐటీడీఏలలో కూడా ప్రతిపాదనలు ఉన్నాయని, త్వరలో కార్యారూపం దాలుస్తాయని చెప్పారు.