తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో రాష్ట్రం పలు రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించిందని ఫార్మా, ఐటి, పట్టణాభివృద్ధి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని జిఏడి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా అన్నారు. బుధవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సింగపూర్ కాన్సుల్ జనరల్ పొంగ్ కాక్ టియాన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం జిఏడి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తో సమావేశమైనది. ఈ సమావేశంలో ప్రోటోకాల్ డైరెక్టర్ అర్వింధర్ సింగ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయస్ధాయి విమానాశ్రయం తో పాటు అవుటర్ రింగ్ రోడ్ ద్వారా మెరుగైన రవాణా వ్యవస్ధ అందుబాటులో ఉందని తెలుపుతూ రాష్ట్ర మున్సిపల్ శాఖామాత్యులు శ్రీ కె.తారకరామారావు తో సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కొనసాగింపుగా జిఏడి ద్వారా వివిధ శాఖలతో, స్టేక్ హోల్డర్ లతో సమావేశాలు నిర్వహించడానికి తగు చర్యలు తీసుకుంటామని వారికి తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, వాణిజ్య సంబంధాల మెరుగుకు మరిన్ని చర్యలు తీసుకోవాలన్నారు.
ఐటి, ఫార్మా, బయోటెక్నాలజి, టూరిజం, ఎడ్యుకేషన్, అర్బన్ డెవలప్ మెంట్, హెల్త్, హాస్పిటాలిటీ రంగాలలో పెట్టుబడులు పెట్టవచ్చన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మెరుగైన శాంతి భద్రతలో ప్రశాంత వాతవరణం నెలకొని ఉందని, పెట్టుబడులకు అనుకూలమని, వాణిజ్యవేత్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు దశల వారిగా ప్లాస్టిక్ నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తెలుపగా, సింగపూర్ ప్రతినిధి బృందం అభినందించింది. కోల్డ్ చైన్ రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని సింగపూర్ బృందం తెలిపింది. వివిధ శాఖలతో అవసరమైన సమావేశాలు నిర్వహించి, ఆసక్తి ఉన్నరంగాలలో పెట్టుబడులు వచ్చేలా కృషి చేయాలన్నారు. సింగపూర్ లో వాణిజ్య సంబంధాల పెంపుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. .