ప్రస్తుత కాలంలో జీవరాశులను రక్షించుకోవాలన్నా, మానవ జాతి మనుగడను కొనసాగించాలన్న పచ్చదనంతో కూడిన కాలుష్యరహిత వాతావరణం చాలా అవసరం. దానికి అనుగుణంగా రాజ్యసభ సభ్యులు జోగినేపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అపూర్వ స్పందన లభిస్తోంది. రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖుల నుంచి సామాన్య ప్రజల వరకు ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ఇప్పటికే గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన బాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి, టెన్నిస్ స్టార్ సానియామీర్జాలకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. తాజాగా విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించారు. విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారి జన్మదినం సందర్భంగా వైజాగ్ , చినముషిడివాడలోని విశాఖ శ్రీ శారదాపీఠం ప్రాంగణంలో శ్రీ స్వాత్మానందేంద్ర స్వయంగా మూడు రుద్రాక్ష మొక్కలను నాటారు. తాజాగా గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంపై శ్రీ స్వాత్మానందేంద్ర స్పందించారు. సమాజంలో ఎన్నో పక్షులు, మరెన్నో జీవరాశులు అంతరించిపోవడానికి ముఖ్య కారణం వాయు కాలుష్యం, వాతావరణ సమతుల్యత లేకపోవడం. వాటి ద్వారా రాబోయే కాలానికి ఎంతో ఉపద్రవం పొంచి ఉన్నదని శ్రీ స్వాత్మానందేంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. పాఠ్య పుస్తకాలలో పక్షులను గురించి తెలుసుకోవడానికే పరిమితమవుతున్న ప్రస్తుత తరుణంలో గ్రీన్ ఛాలెంజ్ అనే వినూత్న కార్యక్రమం మమ్ములను ఎంతో ఆకర్షించినదని ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర తెలిపారు. దీనిని కొనసాగించాలన్న సదుద్దేశంతో టీటీడీ ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డికి, వైజాగ్ జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్‌కు, జీహెచ్ఎంసీ జోనల్ కమీషనర్ హరిచందనకు, ప్రముఖ వ్యాపారవేత్త, క్రీమ్‌స్టోన్ అధినేత విరేన్ షాకు శ్రీ స్వాత్మానందేంద్ర గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఈ ఛాలెంజ్‌లో ప్రతి ఒక్కరూ బాధ్యతయుతంగా స్వీకరించి, ఆకుపచ్చని యజ్ఞంలో భాగస్వాములు కావాల్పిందిగా విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర పిలుపునిచ్చారు. ఈ మేరకు శ్రీ విశాఖ శారదాపీఠం ప్రెస్‌నోట్‌ను విడుదల చేసింది.