ఇండియాజాయ్ -2019 ఎక్స్‌పోని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐటీ సెక్రటరీ జయేశ్ రంజన్, సినీ నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు వంశీ పైడిపల్లి, నటి నమ్రతా శిరోద్కర్, గ్రీన్ గోల్డ్ యానిమేషన్ సీఈవో రాజీవ్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. దేశంలో అతిపెద్ద డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫెస్టివల్ ఇది.
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణ వీఎఫ్‌ఎక్స్, యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్ కలిసి ఇండియాజాయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ ఎక్స్‌పోలో దిగ్గజ కంపెనీలు పాల్గొన్నాయి. 15 విభాగాల్లో పెయింటింగ్ కాంపిటీషన్ నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమకు హైదరాబాద్ చక్కని వేదికగా మారిందన్నారు.
అనేక భారీ సినిమాలకు హైదరాబాద్‌లో వీఎఫ్‌ఎక్స్ వర్క్ జరుగుతోంది. వచ్చే ఏడాది కల్లా ప్రపంచ యానిమేషన్ రంగం 270 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. యానిమేషన్‌తో పాటు గేమింగ్ ఇండస్ట్రీ కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం గేమింగ్ ఇండస్ట్రీ మార్‌ఎట్ విలువ 140 బిలియన్ డాలర్లుగా ఉంది.
ప్రపంచ స్థాయి సినిమా స్టూడియోలు హైదరాబాద్‌లో ఉన్నాయి. వీఎఫ్‌ఎక్స్, గేమింగ్ యానిమేషన్ రంగంలో కోట్లాది రూపాయాల వ్యాపారం జరుగుతోంది. వెయ్యి కోట్ల ఖర్చుతో హైదరాబాద్‌లో ఇమేజ్ టవర్ నిర్మించబోతున్నాం. 2021 చివరి నాటికి ఇమేజ్ టవర్ అందుబాటులోకి వస్తుంది. టాస్క్ ద్వారా ఈ రంగాల్లో ఔత్సాహికులకు శిక్షణ ఇస్తాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.