ఐఎన్‌ఎక్స్ మీడియాకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి. చిదంబరం.. బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ బెయిల్ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. కానీ ఈ బెయిల్ పిటిషన్‌పై వివరణ కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు కోర్టు నోటీసులు జారీచేసింది. ఈనెల 25 కల్లా వివరణ ఇవ్వాలని కోర్టు ఈడీని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను 26వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. ఈడీ దర్యాప్తు చేస్తున్న ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో చిదంబరం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కూడా ఇటీవలే తోసిపుచ్చింది. ఈకేసులో ఆయన కీలకపాత్ర పోషించినట్టు కోర్టు అభిప్రాయపడటంతో ఆయనకు బెయిల్ ఇస్తే, సమాజానికి తప్పుడు సందేశం పంపినట్టవుతుందని కోర్టు అభిప్రాయపడింది. ఈ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చడంతో చిదంబరం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
