టీడీపీ హయాంలో గత ఐదేళ్లుగా చెలరేగిపోయిన జేసీ బ్రదర్స్ రాజకీయ జీవితం చరమాంకంలో పడిందా..త్వరలోనే జేసీ బ్రదర్స్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారా..ప్రస్తుతం అనంతపురం టీడీపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తే నిజమే అనిపిస్తోంది. నవంబర్ 20, బుధవారం నాడు జేసీ బ్రదర్స్‌కు ఊహించని షాక్ తగిలింది. ఎన్నో దశాబ్దాలుగా జేసీ బ్రదర్స్‌కు నమ్మకంగా ఉంటున్న ముఖ్య అనుచరుడు షబ్బీర్ అలీ అలియాస్ గోరా వైసీపీలో చేరారు. గోరాతో పాటు మొత్తం 500 మంది అనుచరులు, తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పకున్నారు. జేసీ అనుచరులతో పాటు పలువురు లారీ యజమానులు కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన 500 మందికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి వైసీపీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కాగా టీడీపీ హయాంలో జేసీ బ్రదర్స్ ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు. భూకబ్జాలు, రియల్ ఎస్టేట్ దందాలు, ల్యాండ్ సెటిల్‌మెంట్లు, జే ట్యాక్స్‌లతో జిల్లాలో అరాచకం సృష్టించారు. ప్రశ్నించినవారిపై భౌతికదాడులకు పాల్పడేవారు. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించిన జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం ఎంపీ పదవికి పోటీ చేయలేదు. తన స్థానంలో తన తనయుడు పవన్‌కుమార్ రెడ్డిని పోటీ చేయించారు. అయితే జగన్ హవాలో జేసీ కుమారుడు కూడా ఓడిపోయారు. ఇక తాడిపత్రిలో జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి వైసీపీ అభ్యర్థి పెద్దారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. టీడీపీ ఘోర పరాజయం తర్వాత జేసీ బ్రదర్స్ అక్రమాలు బయటపడుతున్నాయి. మరోవైపు నిబంధనలను అతిక్రమించి నడుపుతున్న జేసీ ట్రావెల్స్ బస్సులను కూడా ప్రభుత్వం సీజ్ చేసింది. ప్రస్తుతం రాజకీయంగా, ఆర్థికంగా జేసీ బ్రదర్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మళ్లీ జేసీ బ్రదర్స్ రాజకీయంగా పుంజుకోవడం కష్టమే. ఈ నేపథ్యంలో జేసీ ప్రధాన అనుచరుడు గోరాతో పాటు మొత్తం 500 మంది అనుచరులు తమ రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీలో చేరారు. ముఖ్యఅనుచరులు వీడడంతో జేసీ బ్రదర్స్ రాజకీయం జీవితానికి పుల్‌స్టాప్ పడబోతుందంటూ అనంతపురం జిల్లాలో చర్చ జరుగుతోంది. మొత్తంగా ఎవరూ ఊహించనవిధంగా జేసీ బ్రదర్స్ ప్రధాన అనుచరులు వైసీపీలో చేరడంతో అనంతపురం జిల్లాలో టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలిందనే చెప్పాలి.