రంగారెడ్డి జిల్లా… అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం ఘటన తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. చాలా మంది అధికారులు తమపై ఎక్కడ దాడి చేస్తారోననే భయంతో… లంచం అడిగేందుకే భయపడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విజయారెడ్డి హత్య… తెలంగాణలో రెవెన్యూ శాఖను కుదిపేసింది. పనుల కోసం వచ్చేవాళ్లు ఎవరు ఎలా ప్రవర్తిస్తారో అనే భయం ఉద్యోగులను పట్టుకుంది. ముందు జాగ్రత్త చర్యగా కొంతమంది అధికారులు తమను తాము రక్షించుకునే పనిలో పడ్డారు. ఈ భయం ఏపీలో కూడా పెరుగుతోంది. కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మార్వో… తనపై దాడి జరగకుండా ముందుగానే తన చాంబర్లో తన టేబుల్‌కు ముందు అడ్డంగా ఓ తాడు కట్టించుకున్న వీడియో సోసల్ మీడియాలో మల్ చల్ చేస్తోంది. తాజాగా మరో ప్రభుత్వ అధికారి “నేను లంచం తీసుకోను” అని పెద్ద అక్షరాలతో తన ఆఫీసులో బోర్డు పెట్టించుకున్నారు. కరీంనగర్ ఎలక్ట్రిసిటీ సర్కిల్ ఆఫీసులో కమర్షియల్ ఏడీఈగా పనిచేస్తున్న పోడేటి అశోక్ తన కార్యాలయంలో ఇలా బోర్డు రాయించి పెట్టడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది.
