తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ ,గ్రామీణాభివృద్ధి ,గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో పీఎంజీఎస్ వై కింద కేంద్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేస్తున్న వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని రోడ్ల ప్రతిపాదనలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ” రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు,పల్లెలకు స్వచ్చమైన తాగునీరుతో పాటుగా మెరుగైన నాణ్యమైన రవాణా వసతిని కల్పించడమే ముఖ్య లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని ఉద్ఘాటించారు.రాష్ట్రంలో ప్రతి గ్రామానికి ,ప్రతి పల్లెకు ఖచ్చితంగా తారు రోడ్డు ఉండాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.20 కోట్ల చొప్పున ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు.
పీఎంజీఎస్ వై మూడు దశల కింద ఈ ప్రతిపాదనలు ఉండాలని… ప్రతి నియోజకవర్గానికి మొదటి దశలో రూ.8 కోట్లు, రెండో దశలో రూ.8 కోట్లు, మూడో దశలో రూ.4 కోట్లకు సరిపోయేలా రోడ్ల ప్రతిపాదనలు ఉండాలని చెప్పారు. పీఎంజీఎస్ వై మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల ప్రతిపాదనలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ కార్యాలయంలో పీఎంజీఎస్ వై రాష్ట్ర కార్యాలయం చీఫ్ ఇంజనీర్ ఎం.రాజశేఖర్ రెడ్డి, వరంగల్ రీజియన్ ఎస్ఈ ఎస్.సంపత్ కుమార్, మహబూబాబాద్ ఈఈ కె.సురేశ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.