తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ మరో ఖ్యాతి నొందింది. నగరంలో ప్రజలకు నల్లాల ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోజు విడిచి రోజు స్వచ్చమైన తాగునీరు అందిస్తోన్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సంస్థ నిర్వహించిన సర్వేలో హైదరాబాద్ తాగునీరు భేష్ అని తేలింది. మొత్తం పది శాంపిళ్లను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సేకరించగా తొమ్మిది శాంపిళ్లల్లో హైదరాబాద్ తాగునీరు బెస్ట్ అని తేలింది.
బీఐఎస్ దేశంలోని మొత్తం ఇరవై ఒక్క నగరాల్లో శాంపిళ్లను సేకరించి పరిశోధనలు చేయగా హైదరాబాద్ మహానగరానికి రెండో స్థానం దక్కింది. అయితే దేశ రాజధాని ఢిల్లీ చిట్ట చివర స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో ప్రముఖ వాణిజ్య నగరమైన ముంబై ప్రథమ స్థానంలో నిలిచింది.
కేంద్ర ఆహార ,ప్రజా పంపిణీ ,వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ఆదివారం బీఐఎస్ నివేదికను విడుదల చేశారు. ఈ సర్వేలో ఒక్కోక్క నగరం నుంచి పది శాంపిల్స్ సేకరించి ఇరవై ఎనిమిది రకాల ప్రమాణాలపై పరీక్షలు నిర్వహించినట్లు మంత్రి వెల్లడించారు. అయితే హైదరాబాద్ లో తీసుకున్న పది శాంపిళ్లల్లో 9శాంపిల్స్ అన్ని ప్రమాణాల మేరకు పరీక్షకు నిలబడ్డాయని మంత్రి తెలిపారు.