తెలంగాణను అత్యంత పర్యావరణ హితమైన, నివాసయోగ్యమైన రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రతీ ఒక్కరి సహకారం అవసరమని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పర్యావరణం, వన్యప్రాణుల సంరక్షణపై ఏర్పాటైన శాసనసభ కమిటీ తొలి సమావేశం స్పీకర్ పోచారం అధ్యక్షతన అసెంబ్లీలో జరిగింది. అసెంబ్లీ ఆవరణను పర్యావరణ హితంగా ప్రకటిస్తున్నామని, ఇకపై ప్లాస్టిక్ తో తయారైన వస్తువులు అసెంబ్లీలో వాడబోమని ఈ సందర్భంగా స్పీకర్ ప్రకటించారు. కమిటీలో సభ్యులైన శాసనమండలి సభ్యులు శేరి సుభాష్ రెడ్డి, పురాణం సతీష్, మీర్జా రియాజ్ ఉల్ హసన్, శాసన సభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, మహారెడ్డి భూపాల్ రెడ్డి, మౌజమ్ ఖాన్ సమావేశానికి హాజరయ్యారు. అటవీ, సాగునీటి, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అడవులు, వన్యప్రాణుల రక్షణ, తెలంగాణకు హరితహారం అమలు, అడవుల పునరుజ్జీవనం, పర్యావరణ హిత చర్యలపై కమిటీ సమీక్షించింది.
మనిషి మనుగడకు స్వచ్చమైన గాలి, ఫ్లోరైడ్ రహిత మంచినీరు, పరిశుభ్రమైన ఆహారం అవసరమని, ఈ ప్రాధాన్యతను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం, ఆ దిశగానే చర్యలను తీసుకుంటోందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అందుకే తెలంగాణకు హరితహారం, మిషన్ బగీరథ, కాళేశ్వరం లాంటి పథకాలు, ప్రాజెక్టులకు దేశ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయన్నారు. అడవులను కాపాడటం అంటే మనను మనమే రక్షించుకోవటం అనే విషయాన్ని ప్రతీఒక్కరూ గుర్తించాలని కోరారు. అటవీశాఖ తరపును తీసుకుంటున్న చర్యలు, అమలు చేస్తున్న కార్యక్రమాలపై దాదాపు మూడున్నర గంటల పాటు పీసీసీఎఫ్ తో పాటు ఇతర అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. స్పీకర్ తో సహా, ఇతర సభ్యులు విభాగాల వారీగా తమ సూచనలు ఇస్తూ, పలుసార్లు సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ సీజన్ లో అన్నిచోట్లా మంచి వర్షపాతం నమోదు అయినప్పటికీ ఒక్క మంజీరా నది పరివాహక ప్రాంతం మాత్రం సంతృప్తికరంగా లేదని, దానికి గల కారణాలను అన్వేషించాలని అటవీ, సాగునీటి శాఖల అధికారులను స్పీకర్ ఆదేశించారు.
కంపా నిధులను సద్వినియోగం చేస్తూ రిజర్వు అటవీ ప్రాంతాల్లో నీటి కుంటలను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయాలని సూచించారు. నాటిన మొక్కల్లో బతికే శాతం పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, అడవి పందులు, కోతుల బెడద నివారణకు అటవీ పునరుజ్జీవన చర్యల్లో పండ్లమొక్కలు నాటేందుకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని కమిటీ సూచించింది. ప్రభుత్వం, అటవీ శాఖ తీసుకుంటున్న చొరవ వల్ల అటవీ భూముల్లో చొరబాట్లు తగ్గాయని, పర్యావరణపరమైన అవగాహన కూడా ప్రజల్లో బాగా పెరిగిందని శాసన సభ్యులు అభిప్రాయపడ్డారు.
గజ్వేల్ ప్రాంతం ములుగు తరహాలోనే రాష్ట్ర మంతటా అటవీ పునరుజ్జీవన చర్యలు వేగంగా చేపట్టాలని, పోచారం అభయారణ్యంలో మంచి జంతు సంపద ఉన్నప్పటికీ మరింతగా అటవీ ప్రాణులు పెరిగేందుకు కృషిచేయాలని, పారిశ్రామిక ప్రాంతాల్లో ట్రీట్ మెంట్ ప్లాంట్లను పెంచటంతో పాటు సమర్థవంతంగా నిర్వహించాలని మండలి సభ్యులు శేరి సుభాష్ రెడ్డి సూచించారు.
మరో సభ్యులు పురాణం సతీష్ మాట్లాడుతూ తెలంగాణకు హరితహారం ద్వారా వస్తున్న పచ్చటి మార్పును తాము ఆహ్వానిస్తున్నామని, మారుమూల ప్రాంతాల్లో మౌళిక సదుపాయాల అభివృద్దికి అవసరమైన అనుమతులు వేగంగా ఇవ్వాలని కోరారు.
ఐంఐఎం శాసససభ్యులు మౌంజమ్ ఖాన్ మాట్లాడుతూ పాతబస్తీలో ఉన్న నెహ్రూ జూ పార్క్ అభివృద్ది సంతృప్తికరంగా ఉందని, కమిటీ ఒక సారి క్షేత్ర స్థాయిలో జూలో పర్యటించి మరిన్ని సూచనలు చేయాలని కోరారు. పర్యావరణ పరంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో జింకలు, నెమళ్ల సంఖ్య విపరీతంగా పెరగటం వల్ల రైతుల పంటలకు నష్టం చేస్తున్నాయని, వాటి తరలింపు, జూరాల వద్ద జింకల పార్కును నెలకొల్పటంపై దృష్టి పెట్టాలని కోరారు.
గ్రీన్ ఛాలెంజ్ ను అత్యంత విజయవంతంగా నిర్వహిస్తున్న రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ ను శాసన సభ పర్యావరణ కమిటీ ప్రత్యేకంగా అభినందించింది. తెలంగాణకు హరితహారం నిర్వహణకు గ్రీన్ ఛాలెంజ్ అదనపు ఆకర్షణగా నిలిచిందని, అన్ని వర్గాల వారిని భాగస్వామ్యులను చేస్తూ సంతోష్ చేస్తున్న కృషి దేశ, విదేశాల్లో ఎంతోమందికి పర్యావరణ హితంపై ఆదర్శంగా నిలిచిందని స్పీకర్ తెలిపారు.