టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌లపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలతో ఏపీ పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. వంశీ వ్యాఖ్యలపై సీరియస్ అయిన టీడీపీ అధిష్టానం ఆయన్ని సస్పెండ్ చేసింది. అయినా వంశీ ఏమాత్రం తగ్గడం లేదు. మరింత పదునైన పదజాలంతో చంద్రబాబు, లోకేష్‌లపై విరుచుకుపడుతున్నాడు. ముఖ్యంగా 2009లో పార్టీకి ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత ఎందుకు పార్టీలో కనిపించడం లేదని వంశీ ప్రశ్నించారు. లోకేష్ పది జన్మలెత్తినా జూనియర్ ఎన్టీఆర్ స్థాయికి రాలేడని వంశీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎన్టీఆర్ అంటే లోకేష్‌కు భయం, వణుకు, జ్వరం అని ఎద్దేవా చేశారు. తాజాగా వల్లభనేని ఇష్యూ నేపథ్యంలో బాబు, లోకేష్‌లపై మంత్రి కొడాలి నాని తనదైన స్టైల్లో స్పందించారు. టీడీపీకి ప్రజాదరణ తగ్గడానికి బాబు, లోకేష్‌లే కారణమని నాని ఆరోపించారు. ఇకనైనా పార్టీ పగ్గాలు మార్చకపోయే టీడీపీ ఉనికి, అస్థిత్వం కోల్పోయే ప్రమాదం ఉందని నాని హెచ్చరించారు. 2009లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయడం వల్లే టీడీపీకి ఆ మాత్రం సీట్లు వచ్చాయని..లేకుంటే చంద్రబాబు, లోకేష్‌లకు అంత సీన్ లేదని అన్నారు.. లోకేష్ దద్దమ్మ కాబట్టే..అడ్డదారిలో పదవి కట్టబెట్టారని విమర్శించారు. గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారని నాని గుర్తు చేశారు. టీడీపీకి పూర్వవైభవం రావాలంటే వెంటనే పార్టీ బాధ్యతలను..జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగించాలని అవసరం ఉందన్నారు. అలా కాదని లోకేష్‌కు బాధ్యతలు అప్పగిస్తే..పార్టీ మునగడం ఖాయమని కొడాలి నాని స్పష్టం చేశారు. అయితే జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితులైన వల్లభనేని వంశీ, కొడాలి నానిలు.. చంద్రబాబు,లోకేష్‌లను టార్గెట్ చేయడం ఇప్పుడు టీడీపీలో కలకలం రేపుతోంది. మొత్తంగా వల్లభనేని వంశీ, కొడాలి నాని వ్యాఖ్యల నేపథ్యంలో టీడీపీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగించాలని నందమూరి అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.