విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామవారి హిందూ ధర్మ ప్రచారయాత్ర ఉమ్మడి మెదక్ జిల్లాలో దిగ్విజయవంతంగా కొనసాగుతోంది. ధర్మ ప్రచారయాత్రలో భాగంగా నవంబర్ 16, శనివారం నాడు కొమురవెల్లి మల్లన్నస్వామిని శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన స్వామివారికి అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. మల్లన్న స్వామికి శ్రీ స్వాత్మానందేంద్ర స్వయంగా పూజలు చేశారు. తొలిసారి కొమురవెల్లికి విచ్చేసి స్వామివారికి ఆలయ అధికారులు, అర్చకులు పండ్లు, ఫలహారాలు సమర్పించి ఘనంగా సత్కరించారు. తదనంతరం స్వామివారు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా శ్రీ స్వాత్మానందేంద్ర మాట్లాడుతూ..గురువర్యులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారి ఆశీస్సులతో హిందూ ధర్మ పరిరక్షణ నిమిత్తం దేశమంతటా ధర్మ ప్రచారయాత్ర చేపట్టినట్లు తెలిపారు. ముఖ్యంగా ఎన్నో చారిత్రక, మహిమాన్విత ఆలయాలకు ప్రసిద్ధి చెందిన తెలంగాణ నుంచి ధర్మ ప్రచారయాత్ర ప్రారంభించినట్లు స్వామిజీ తెలిపారు. ఇప్పటివరకు ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాలలో దాదాపు 5000 కి.మీ. మేర యాత్ర పూర్తిచేసినట్లు శ్రీ స్వాత్మానందేంద్ర పేర్కొన్నారు. సాక్షాత్తు పరమశివుడు మల్లన్నస్వామిగా కొలువైన కొమురవెల్లిని దర్శించుకోవడం తనకు ఆనందంగా ఉందని స్వామిజీ అన్నారు. ఈ నెల 18 వరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో హిందూ ధర్మ ప్రచారయాత్ర సాగుతుందని స్వామిజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో గుండు శ్రీను, ఆకుల శ్రీనివాస్ రెడ్డి, కృష్ణమాచార్య, స్వామివారి హిందూ ధర్మ ప్రచారయాత్ర తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త, దరువు ఎండీ సీహెచ్ కరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
