తెలంగాణ హిందూ ధర్మ ప్రచారయాత్రలో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో పర్యటిస్తున్న విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ సరస్వతి శనివారం నాడు సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడకను సందర్శించారు. స్వామివారికి స్థానిక శివాలయం అర్చకులు, గ్రామసర్పంచ్, ప్రజలు, చిన్నారులు మేళతాళాలతో స్వామివారికి ఎదురేగి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన శ్రీ స్వాత్మానందేంద్ర భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. పూజల అనంతరం గ్రామస్థులతో శ్రీ స్వాత్మానందేంద్ర ఆత్మీయ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా శివాలయం పూజారి, గ్రామ సర్పంచ్ సీఎం కేసీఆర్ బాల్యం, విద్యాభాస్యం తదితర విషయాలతోపాటు చింతమడక గ్రామంతో ఆయనకున్న ఉన్న అనుబంధం గురించి శ్రీ స్వాత్మానందేంద్రతో పంచుకున్నారు. సీఎం కేసీఆర్ గ్రామంలో చేపడుతున్న పలు అభివృద్దిపనులు, కొత్తగా నిర్మిస్తున్న రామాలయం గురించి స్వామివారికి వివరించారు. ఈ సందర్భంగా శ్రీ స్వాత్మానందేంద్ర మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ చేస్తున్న మంచి పనులు బాగున్నాయని అభినందించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా యాదాద్రిని అద్భుత క్షేత్రంగా నిర్మిస్తున్నారని, హిందూ ధర్మ పరిరక్షణ కోసం కేసీఆర్ గారు చేస్తున్న కృషి అభినందనీయం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చింతమడక గ్రామ సర్పంచ్ హంస కేతన్ రెడ్డి, గ్రామ ప్రజలు, హిందూ ధర్మ ప్రచారయాత్ర తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త, దరువు ఎండీ సీహెచ్ కరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
