రాష్ట్ర ప్రభుత్వం స్పందన పేరుతో ప్రతి సోమవారం ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా వచ్చిన వారిని మర్యాదగా చూడాలని..కనీసం మజ్జిగయినా ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గతంలో అధికారులకు సూచించారు. ఈ మాటలను కడప డీఎస్పీ యు. సూర్యనారాయణ ప్రేరణగా తీసుకున్నారు. మజ్జిగో మంచినీళ్లో కాకుండా ఒకడుగు ముందుకేసి ఉచితంగా భోజన వసతి కల్పిస్తున్నారు. కడప పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో గడచిన వందరోజులుగా అమలు చేస్తున్నారు. పైసా ఎవరినుంచి తీసుకోకుండా ఇందుకయ్యే మొత్తాన్ని ఆయనే భరిస్తున్నారు.
సబ్ డివిజన్ పరిధిలో కడప నగరంతో పాటు, చెన్నూరు, కమలాపురం, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల, చింతకొమ్మదిన్నె, వల్లూరు, పెండ్లిమర్రి మండలాలున్నాయి. ఈ ప్రాంతాల నుంచి ప్రతి సోమవారం వినతులు చేతపట్టుకుని ప్రజలు వస్తుంటారు. వీటిని పరిష్కరించడానికి అధికారులకు కొంత సమయం పడుతుంది. తామిచి్చన దరఖాస్తుల పరిస్థితి ఏమిటంటూ వారు కార్యాలయానికి మళ్లీ వస్తుంటారు. ఇది వారం పొడవునా జరిగే ప్రక్రియ. ఇలా వచ్చేవారు చాలాసేపు నిరీక్షించాలి్సన సందర్భాలుంటాయి. మధ్యలో దూరం వెళ్లి భోజనం చేయడానికి ఇబ్బందులు పడటాన్ని డీఎస్సీ సూర్యనారాయణ గమనించారు. వారికి అలాంటి ఇబ్బంది కలుగకుండా ఆయన చొరవ తీసుకుని ఉచిత భోజనం ఏర్పాటు చేస్తున్నారు. మూడు నెలలుగా రోజూ 50 మందికి తక్కువ కాకుండా భోజనం చేస్తున్నారని డిఎస్పీ సూర్యనారాయణ తెలిపారు..
ప్రతి ఫిర్యాది ఆనందంగా వెళ్లడమే ధ్యేయం
సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చాను. చిన్నతనంలో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలన్నా, ఎమ్మార్వో ఆఫీస్‌కు పోవాలన్నా ఎంతో యాతనయ్యేది. పనులుకాకపోతే ఉసూరుమంటూ ఇంటికి వచ్చేవాళ్లం. సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్‌లు ‘స్పందన’కు సంబంధించి చెప్పిన మాటలు నాకు ఉత్సాహాన్ని ఇచ్చాయి. అందుకే ఫిర్యాదుదారులను ఆకలితో పంపకుండా భోజనం చేసి వెళ్లమంటున్నాను. దీన్ని పెద్ద సహాయంగా నేను భావించడం లేదు.
–సూర్యనారాయణ, డీఎస్పీ, కడప, వైఎస్‌ఆర్ జిల్లా
ఇలా ఎవరూ భోజనం పెట్టలేదు…
మా ఊరిలో స్థలం విషయమై బంధువులతో కలిసి ఉదయం ఉదయం 9 గంటలకు వచ్చాను. ఇక్కడ మధ్యాహ్నం కాకమునుపే భోజనం పెట్టారు. ఎంతసేపయినా ఎదురుచూసి సమస్యను పరిష్కరించుకుని వెళతామనీ ధీమాగా వుంది. ఏ ప్రభుత్వ కార్యాలయంలోనూ గతంలో భోజనం పెట్టిన దాఖలాలు లేవు.
ఎన్.మునీంద్రబాబు, ఎర్రగుడిపాడు, కమలాపురం