బతికున్నంత వరకు వైసీపీలోనే ఉంటానని కర్నూల్ జిల్లా పాణ్యం వైసీపీ ఎమెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. యాగంటి నుంచి శ్రీశైలం వరకు చేపట్టిన పాదయాత్ర శుక్రవారం ఆయన పాణ్యంకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చివరి వరకు వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తోనే నడుస్తానన్నారు. గోరుకల్లు రిజర్వాయర్‌ను తాను కోరిన వెంటనే దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి రూ. 470 కోట్లు కేటాయించి రిజర్వాయర్ నిర్మాణానికి సహకరించారన్నారు. శ్రీశైలం రిజర్వాయర్ చరిత్రలో ఎనిమిది సార్లు గేట్లు ఎత్తిన ఘనత ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పాలనకే దక్కుతుందన్నారు. గాలేరు, నగరి హెడ్ రెగ్యులేటర్‌కు గేట్లు ఏర్పాటు చేసి రెండు పంటలకు నీరు అందిస్తామన్నారు.
