విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి తెలంగాణ హిందూ ధర్మ ప్రచారయాత్ర ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రారంభమైంది. హైదరాబాద్‌లో యాత్ర ముగించుకుని నవంబర్ 15, శుక్రవారం నాడు సిద్ధిపేట్‌లో అడుగుపెట్టిన శ్రీ స్వాత్మానందేంద్రకు విశాఖ శ్రీ శారదాపీఠం భక్తులు ఘనస్వాగతం పలికారు. సిద్ధిపేటలోని శరబేశ్వర ఆలయం, కోటి లింగేశ్వర ఆలయం, శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాలను శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి ఆయా ఆలయాల అర్చకులు, అధికారులు, భక్తులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అలాగే హనుమాన్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శ్రీ రాజశ్యామల అమ్మవారికి పీఠపూజలు నిర్వహించారు. హిందూ ధర్మ ప్రచారయాత్రలో భాగంగా నవంబర్ 15 నుంచి 18 వరకు శ్రీ స్వాత్మానందేంద్ర ఉమ్మడి మెదక్ జిల్లాలో పర్యటిస్తారు. ఈ నాలుగు రోజుల పాటు జిల్లాలోని పలు దేవాలయాల దర్శనంతో పాటు భక్తుల ఇండ్లలో పాదపూజల కార్యక్రమాల్లో స్వామిజీ పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా విశాఖ శ్రీ శారదాపీఠం భక్తులు, సిద్ధిపేట పట్టణ ప్రముఖులు, స్వామివారి హిందూ ధర్మ ప్రచారయాత్ర తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త సీహెచ్ కరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
