తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానకాలంలో కురిసిన భారీ వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి వస్తోన్న వరదప్రవాహాంతో కృష్ణా,గోదావరి పరివాహక ప్రాంతాల్లోని చెరువులు,ప్రాజెక్టులు,వాగులు నీటితో కళకళాడుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయతో చెరువుల పూడిక తీయడంతో పెరిగిన నీటినిల్వ సామర్థ్యం.. ఆ చెరువుల కింద జోరుగా సాగిన వ్యవసాయం! ఈయేడు వర్షాలు సమృద్ధిగా పడటంతో ఐదారు గుంటలున్న రైతులు సైతం పంటలను సాగుచేశారు. పంటసీజన్‌లో బీడీలు చుట్టడం బంద్‌పెట్టి మహిళలంతా పత్తి ఏరేందుకు వెళ్లేవారు.
వారితోపాటు వ్యవసాయ కూలీలు పనిచేసేవారు. ఈసారి పంట సాగు పెరుగడంతో కూలీల కొరత ఏర్పడింది. దీంతో ఆంధ్రా, రాయలసీమల నుంచి వందలసంఖ్యలో కూలీలు తెలంగాణకు వలసబాట పడుతున్నారు. ఇప్పటికే భవననిర్మాణరంగంలో 75% ఆంధ్రా కూలీలే పనిచేస్తుండగా, వ్యవసాయరంగంలో 25% మంది పనిచేస్తున్నారు. ఇప్పుడిప్పుడే వారి సంఖ్య పెరుగుతున్నది. ప్రస్తుతం పత్తి ఏరడానికి కర్నూలు, గుంటూరు, మదనపల్లె ఇతర జిల్లాల నుంచి వందలసంఖ్యలో కూలీలు తమ కుటుంబాలతో వచ్చి ఇక్కడ ఉపాధి పొందుతున్నారు.
ఈ క్రమంలో రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో కొందరు రైతులు కలిసి ఏపీనుంచి సుమారు 500 మంది కూలీలను రప్పించుకున్నారు. ఒక్కో రైతు 30 నుంచి 50 మందిని పత్తి ఏరే పనిలో పెట్టుకున్నారు. వీరికి గ్రామాల్లో షెడ్లు కూడా ఏర్పాటుచేసి వసతి కల్పిస్తున్నారు. ఆంధ్రాలో పనిచేస్తున్న కూలీలకు రోజుకు రెండొందలే ఇస్తున్నారు.
ఇక్కడ రూ.400 నుంచి రూ.500 దాకా గిట్టుబాటు అవుతున్నది. ఉదయం ఆరుగంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు పత్తి ఏరే పనిలో ఉంటున్నారు. పత్తి ఏరినందుకు కిలోకు పది రూపాయల చొప్పున రైతులు చెల్లిస్తున్నారు. రోజుకు ఒక్కో కూలీ 50 నుంచి 60 కిలోల పత్తి ఏరుతున్నారు. నెలకు రూ.15 వేలనుంచి రూ.20 వేలు సంపాదిస్తున్నట్టు కూలీలు తెలిపారు.