వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ ఇంటి వారయ్యారు. అదేనండి కొత్త ఇంట్లోకి వెళ్లారు. శుక్రవారం విజయవాడలో కొత్తగా నిర్మించిన ఇంట్లో విజయసాయిరెడ్డి గృహ ప్రవేశం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయ బద్దంగా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే విజయసాయి రెడ్డి నూతన గృహ ప్రవేశం చాలా సింపుల్గా జరగడం విశేషం. కొద్ది మంది పార్టీ నాయకులు మాత్రమే ఈ గృహ ప్రవేశానికి హాజరయ్యారు. విజయసాయిరెడ్డికి హైదరాబాద్లో సొంతిల్లు ఉంది. అయితే ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంతో సీఎం జగన్ తర్వాత పార్టీలో విజయసాయిరెడ్డి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో విజయవాడకు, హైదరాబాద్కు ప్రయాణాలు చేయడం ఆయనకు కష్టంగా మారింది. ఇప్పటికే సీఎం జగన్ తాడేపల్లిలో సొంత నివాసం కట్టుకుని పూర్తిగా ఏపీకే పరిమితం అయ్యారు. అధినేత బాటలో విజయసాయిరెడ్డి కూడా పయనించారు. ఈ మేరకు సకల సౌకర్యాలతో సొంతిల్లు కట్టుకున్నారు. విశాలమైన హాలు, డిజిటల్ స్క్రీన్, ఎల్ఈడీ టీవీలతో అత్యాధునికంగా ఇల్లు రూపుదిద్దుకుంది. ఏర్పాటు చేశారు. పార్టీ శ్రేణులతో అనుసంధానం అయ్యేలా వీడియో సౌకర్యం కూడా ఉండడం విశేషం. మొత్తంగా సొంతింటితో విజయసాయిరెడ్డి ఇక నుంచి విజయవాడలో పార్టీ శ్రేణులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండనున్నారు.
