నాడు–నేడు కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా సమర్థంగా సభ నిర్వహించారంటూ ఎస్పీ సిద్థార్థ కౌశల్‌ను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, గుంటూరు రేంజి ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ శభాష్ సిద్ధార్థ..అంటూ ప్రశంసించారు. గురువారం ఒంగోలులోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరు కావడం, వేదిక మొత్తం జనంతో కిక్కిరిసి పోయింది. క్రౌడ్ కంట్రోల్ విషయంలో తీసుకున్న చర్యలు బాగున్నాయంటూ సీఎం నుంచి ఎస్పీ ప్రశంసలు అందుకున్నారు. బందోబస్తు పర్యవేక్షించిన ఎస్పీతో పాటు విధుల్లో పాల్గొన్న సిబ్బందిని కూడా జగన్ అభినందించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తీసుకున్న చర్యలు బాగున్నాయని ఎస్పీ పలువురి ప్రశంసలు అందుకున్నారు. ఉదయం 10.25కు ఒంగోలు పోలీసు ట్రైనింగ్ కాలేజీలో దిగిన సీఎం తిరిగి 12.37 గంటలకు హెలిపాడ్ చేరుకున్నారు. 12.40 గంటలకు హెలికాప్టర్ టేకాఫ్ తీసుకుంది. మొత్తం 2.15గంటలపాటు ఆయన ఒంగోలులో ఉన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట కల్లా పాఠశాలల బస్సులు సైతం సభాప్రాంగణం నుంచి వెళ్లిపోయాయి. ఆ వెంటనే ట్రాఫిక్ మొత్తం క్లియర్ కావడంతో ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో సామాన్య ప్రజలు, ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు.
