తన స్వార్థ రాజకీయాల కోసం ప్రత్యర్థుల వ్యక్తిత్వహననం చేయడానికి కూడా వెనుకాడని మనస్తత్వం..టీడీపీ అధినేత చంద్రబాబుది. ప్రత్యర్థి పార్టీల్లోకి కోవర్టులను పంపించి..వారి ద్వారా తన కుట్రలను అమలు చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. 2009లో వైయస్‌ను ఓడించడానికి..తొలుత ప్రజా రాజ్యం పార్టీని ఎల్లోమీడియాతో ఎంకరేజ్ చేయించిన చంద్రబాబు..అదే ప్రజారాజ్యం పార్టీ ద్వారా తనకు దెబ్బ పడుతుందని తెలిసి..వెంటనే చిరు ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా కుట్రలు చేశాడు. పరకాల ప్రభాకర్ వంటి కోవర్టులను ప్రజారాజ్యం పార్టీలోకి పంపాడు. బాబుగారి స్కెచ్ మేరకు పరకాల పార్టీ ఆఫీసులోనే మీటింగ్ పెట్టి మరీ చిరును తిట్టి రాజీనామా చేసి బయటకు వచ్చాడు. 2009లో టీఆర్ఎస్తో పొత్తులు పెట్టుకుని మరీ, టికెట్లు కూడా అమ్ముకున్న చంద్రబాబు.. చిరంజీవి, ఆయన బామ్మర్ది అల్లు అరవింద్ డబ్బులకు టికెట్లు అమ్ముకుంటున్నారని ఎల్లోమీడియాతో దుష్ప్రచారం చేయించాడు. ఆఖరకు ప్రత్యర్థుల కుటుంబాల్లోని మహిళల వ్యక్తిత్వాన్ని కూడా దిగజార్చడానికి కూడా టీడీపీ నేతలు వెనుకాడరు. 2014 ఎన్నికలకు ముందు నుచి నాటి ప్రతిపక్ష నేత సోదరికి, ఓ సినీ హీరోతో అనైతిక సంబంధం అంటగట్టి టీడీపీ నేతలు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయించారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా టీడీపీ నేతలు సదరు మహిళానేత వ్యక్తిత్వాన్ని కించపర్చేలా ప్రచారం చేయించారు. ఈ విషయంపై ఆ మహిళా నేత సైబరాబాద్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఇక టీడీపీ నేతలు మహిళలను లైంగికంగా వేధించిన ఘటనలు కోకొల్లలు. ఇదే విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బయటపెట్టారు. తాజాగా టీడీపీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వంశీ చంద్రబాబు, లోకేష్, మాజీ మంత్రి దేవినేని ఉమలతో సహా పలువురు టీడీపీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ తర్వాత బాబుగారు ఏనాడైనా ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసి గెలిచారా అని ఎద్దేవా చేశారు. 2009లో సినిమాలు మానుకుని ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ టీడీపీలోకి కనిపించకపోవడానికి కారణం ఏంటని చంద్రబాబును ప్రశ్నించారు. వర్థంతికి, జయంతికి తేడా తెలియని నాయకుల మాట నేను వినాలా అంటూ లోకేష్‌పై సెటైర్ వేసిన వంశీ..దేవినేని ఉమలాంటి నేతలు తొక్కేయడం వల్లనే పార్టీకి రాజీనామా చేసినట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ పెద్దలు తమలాంటి నాయకులనే కాదు..మహిళల వ్యక్తిత్వాన్ని దెబ్బతీయటానికి వెనుకాడరని వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అత్యంత పెద్ద కుటుంబానికి చెందిన ఒక మహిళకు ఓ టీడీపీ నేత 10వేల కు పైగా ఈ-మొయిల్స్ పెట్టి వేధించారని…. ఆ తర్వాత తప్పు అయిందని వెళ్లి కాళ్ల మీద పడ్డారంటూ వంశీ బాంబు పేల్చారు. ఈ ఈమెయిల్స్ వ్యవహారం చంద్రబాబుకు తెలిసినా వారించలేదని సమాచారం. అయితే ఆ పెద్దింటి మహిళ ఎవరు..అలాంటి పాడుపని చేసిన టీడీపీ నేత ఎవరన్నది మాత్రం వంశీ బయటపెట్టలేదు. అయితే మహిళ గౌరవ మర్యాదల దృష్ట్యా ఆమె పేరు బయటపెట్టకపోయినా..ఆవిడను వేధించిన టీడీపీ నేత పేరు మాత్రం వంశీ బయటపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తంగా ఏపీలో పెద్ద కుటుంబానికి చెందిన మహిళకు 10 వేల మెయిల్స్ పెట్టి వేధించి, ఆ తర్వాత తప్పు అయిందంటూ కాళ్ల మీద పడిన టీడీపీ నేతల వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
