టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమ, ఇతర టీడీపీ నేతలపై ప్రెస్‌మీట్ పెట్టి మరీ తీవ్ర విమర్శలు చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అధిష్టానం ప్రకటించింది. నిన్న రాత్రి ప్రెస్‌మీట్‌లో వంశీ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇవాళ ఉదయం టీడీపీ సీనియర్ నేతలతో సమావేశమైన చంద్రబాబు వంశీ విమర్శలపై చర్చించినట్లు సమాచారం. కేవలం వైసీపీలోకి వెళ్లేందుకు వంశీ మీ పరువు, పార్టీ పరువు తీసేలా విమర్శలు చేశాడని పార్టీ నేతలు చంద్రబాబుకు వివరించారు. దీంతో పార్టీపై ఎవరూ ఉద్దేశ్యపూర్వకంగా వ్యాఖ‌్యలు చేసినా ఉపేక్షించేది లేదని చంద్రబాబు అన్నట్లు తెలుస్తోంది. తనపై, లోకేష్‌పై, దేవినేని ఉమ, రాజేంద్రప్రసాద వంటి నేతలపై చేసిన విమర్శలను తీవ్రంగా పరిగణించిన చంద్రబాబు వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ నేతలకు తెలిపారంట. ఈ మేరకు టీడీపీ అధిష్టానం అధికారికంగా వంశీని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ఏం బాబుగారు..వంశీ నిజాలు చెబుతుంటే జీర్ణించుకోలేకపోతున్నారా..వంశీ చెప్పినట్లు .. సెల్‌ఫోన్, కంప్యూటర్ కనిపెట్టినట్లు వరదల్లో ఇసుక తీసే టెక్నాలజీని కనిపెట్టమన్నందుకా.. జయంతి, వర్థంతికి తేడా తెలియని లోకేష్ పార్టీ సీనియర్ నేతలపై పెత్తనం చేయడం లేదా..జూనియర్ ఎన్టీఆర్‌ను వాడుకుని ఎక్కడ కొడుకు సీఎం కుర్చీకి అడ్డొస్తాడని తొక్కేయలేదా. ఏనాడైనా ఎన్టీఆర్ తర్వాత పొత్తుల్లేకుండా ఒంటరిగా పోటీ చేసిన గెలిచారా..నిజాలు మాట్లాడితే..జీర్ణించుకోలేక వంశీని సస్పెండ్ చేస్తారా..అయినా మీరు వంశీని సస్పెండ్ చేయడం ఏంటీ..వంశీనే మిమ్మల్ని సస్పెండ్ చేసి వెళ్లిపోయాడంటూ..నెట్‌జన్లు చంద్రబాబుపై మండిపడుతున్నారు. కాగా తనను సస్పెండ్ చేయడంపై వంశీ స్పందించారు. ఆల్రెడీ ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేసిన తనను సస్పెండ్ చేయడం ఏంటంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. మొత్తంగా వల్లభనేని వంశీ సస్పెండ్ వ్యవహారం టీడీపీని కుదిపేస్తోంది.
