ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు కనీసం ప్రతిపక్ష నాయకుడి పాత్ర కూడా పోషించలేకపోతున్నారని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విమర్శించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..అప్పుడే ఈ ప్రభుత్వంపై ప్రతిపక్షం విమర్శలు చేయడం సరికాదని అన్నారు. ఏ ప్రభుత్వానికైనా కొంత సమయం ఇవ్వాలన్నారు. అకాల వర్షాలు, వరదలు వస్తే ఇసుక ఎలా తీయగలమని వంశీ ప్రశ్నించారు. అంతేకాదు వైసీపీ ప్రభుత్వానికి తన మద్దతు తెలియజేస్తున్నానని, ఏపీ సీఎం జగన్ తో కలిసి నడుస్తానని వల్లభనేని వంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గ ప్రజల కోసం, ఇళ్ల పట్టాల కోసం, తన కోరిక సఫలం అవడం కోసం జగన్ ని కలిసిన మాట వాస్తవమేనని అన్నారు. జగన్ తనకు చేసిన ప్రామిస్ మేరకు ఆయనతో కలిసి నడుస్తానని చెప్పారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా తప్పులు జరుగుతాయని, తమ హయాంలో కూడా జరిగాయని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో కొంత మంది అధికారుల కారణంగా తప్పులు జరిగాయని, ఈ విషయాన్నిజగన్ దృష్టికి తీసుకెళ్లానని, వాటిని సరిచేస్తానని తనకు చెప్పారని తెలిపారు.
