పుస్తకం ఒక మంచి నేస్తమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని 52 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు పురస్కరించుకుని జిల్లా కేంద్ర గ్రంథాలయం లో ఏర్పాటుచేసిన గ్రంధాలయ వారోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సిద్దిపేట గ్రంథాలయానికి గొప్ప చరిత్ర ఉందన్నారు.ఎంతోమంది ఈ గ్రంథాలయంలో తమ సందేహాలను నివృత్తి చేసుకొని గొప్ప వ్యక్తిగా ఎదిగారు అని అన్నారు. జాతీయ బాలల దినోత్సవం రోజు గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం కావడం ఆనందంగా ఉందన్నారు. బాలబాలికల అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ₹2 కోట్ల వ్యయంతో నూతన గ్రంథాలయం నిర్మించుకుంటున్నామన్నారు. నూతన గ్రంథాలయం మార్చి నెలల్లో సర్వాంగ సుందరంగా ప్రారంభోత్సవానికి ముస్తాబు కానుందన్నారు. మహిళలకు పురుషులకు విద్యార్థులకు వేరువేరుగా విభాగాలు ఏర్పాటు చేయనున్నామన్నారు. నేటి యువత సెల్ఫోన్ మోజులోపడి పుస్తక పఠనాన్ని మర్చిపోవడం బాధ కలిగిస్తోందన్నారు.పుస్తకం మంచి నేస్తం అన్న విషయాన్ని నేటి యువత అర్థం చేసుకొని గ్రంథాలయాలకు వచ్చే సమయాన్ని డబ్బును ఆదా చేసుకోవాలన్నారు. కబుర్లతో కాలక్షేపం చేస్తూ విలువైన సమయాన్ని వృధా చేసుకోకూడదు అని అన్నారు. జిల్లాలో ఏడు మండలాల్లో నూతన గ్రంథాలయం నిర్మించబోతున్నామన్నారు.పుస్తకాల కొనుగోలుకు రూ 40 లక్షలు మంజూరయ్యాయన్నారు. మంజూరైన డబ్బుతో అన్ని తరగతుల పాఠకులకు ఉపయోగపడే పుస్తకాలు కొనుగోలు చేయనున్నామని చెప్పారు… గ్రంథాలయాలకు వచ్చే వారి సంఖ్య క్రమంగా తగ్గుతూ ఉండటం బాధ కలిగిస్తోందన్నారు. పుస్తక పఠనంతో దేశం ప్రపంచం పరిచయమవుతున్నారు. విద్యార్థుల కోరిన పుస్తకాలను గ్రంథాలయంలో అందుబాటులో ఉంచనున్నామన్నారు.