బెజవాడలో 12 గంటల ఇసుక దీక్ష చేపట్టిన చంద్రబాబుకు ఆ పార్టీ కీలక నేత దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు..ఏపీ తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఈ రోజు టీడీపీకి గుడ్‌బై చెప్పాడు. అంతే కాదు గురువారం సాయంత్రం 4 గంటలకు సీఎం జగన్ సమక్షంలో దేవినేని అవినాష్ వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. టీడీపీలో మరో కీలక నేత కడియాల బుచ్చిబాబుతో సహా వేలాది మంది అభిమానులు, అనుచరులతో కలిసి ఈ రోజు సాయంత్రం వైసీపీలో చేరబోతున్నారు. ఈ మేరకు నిన్న పార్టీ కార్యకర్తలతో, అభిమానులతో సమావేశమైన దేవినేని అవినాష్ వారి కోరిక మేరకు వైసీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. కాగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీ చేసిన అవినాష్ కొడాలి నాని చేతిలో ఓడిపోయారు. వాస్తవానికి అవినాష్ పెనమలూరు నుంచి కానీ విజయవాడ తూర్పు నుంచి పోటీ చేయాలని భావించారు. గుడివాడలో పోటీ చేసేందుకు విముఖత చూపారు. కానీ దేవినేని ఉమ రాజకీయంతో చంద్రబాబు అవినాష్‌కు గుడివాడ టికెట్ కేటాయించాడు. దీంతో అయిష్టంగానే పోటీ చేసిన అవినాష్ కొడాలి నానికి గట్టిపోటీ ఇచ్చినప్పటికీ ఓడిపోయారు. కాగా టీడీపీలో ఎంత కష్టపడినా అన్యాయం జరుగుతోందని, ఇక పార్టీలో కొనసాగడంలో అర్థం లేదని భావించిన దేవినేని అవినాష్ అనుచరుల మనోభీష్టం మేరకు వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇసుక దీక్షతో ప్రభుత్వంపై రాజకీయంగా డ్యామేజీ చేయాలనుకున్న చంద్రబాబుకు దేవినేని అవినాష్ వైసీపీలో చేరుతుండడంతో దిమ్మతిరిగే షాక్ తగిలినట్లయింది. మొత్తంగా ఇసుక దీక్ష కంటే..దేవినేని అవినాష్ వైసీపీలో చేరిక వార్తలు ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
