బాలల దినోత్సవం సందర్భంగా ‘మనబడి నాడు-నేడు’ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. గురువారం ఒంగోలులోని పీవీఆర్ బాలుర పాఠశాలలో ఈ కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. అంతకుముందు భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి సీఎం వైఎస్ జగన్ నివాళులర్పించారు. అనంతరం బాలల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నాడు – నేడు కార్యక్రమాన్ని జ్యోతిప్రజ్వలన చేసి అధికారికంగా ప్రారంభించారు.
‘మనబడి నాడు-నేడు’లో భాగంగా వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం రూ.12 వేల కోట్లను కేటాయించనుంది. తొలి దశలో 15,715 పాఠశాలల్లో 9 రకాల సౌకర్యాలతో అభివృద్ది చేయనున్నారు. అయితే రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా సర్కారీ స్కూళ్లకు ఇంత భారీ బడ్జెట్ కేటాయించిన తొలి సీఎంగా వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోనున్నారు.