పుట్టుక నీది..చావు నీది..బతుకంతా దేశానికే అంటూ తన యావత్ జీవితాన్ని తెలంగాణకే అంకితం చేసిన ప్రజాకవి శ్రీ కాళోజీ నారాయణరావు వర్థంతి నేడు. అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు అని సగర్వంగా ప్రకటించి..ఉద్యమమే ఊపిరిగా కడదాకా జీవించిన ప్రజాకవి..కాళోజీ. జీవితాంతం తన రచనలలో తెలంగాణ గోసను చిత్రిస్తూ కోట్లాది ప్రజలలో స్వరాష్ట్ర కాంక్షను రగిలించిన అక్షర యోధుడు…కాళోజీ నారాయణ రావు. కాళోజీ ఓ వ్యక్తి కాదు..ఓ శక్తి…సాహితీ ప్రపంచంలో ప్రజాస్వామ్య ఆకాంక్షగా ప్రజల నోళ్లల్లో నిలిచి, గెలిచిన నిజమైన ప్రజా కవి. కాళోజీ. అసలు కాళోజీ అనగానే ఆయన రాసిన ` నా గొడవ ` కవితా సంపుటి గుర్తు వస్తుంది..నిజానికి అది కాళోజీ గొడవే అసలే కాదు..అది తెలంగాణ ప్రజల గోస… సమాజంలోని కుళ్లును, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు పడుతున్న గోసను ` నా గొడవ ` పేరుతో రచనలు గావించారు.. ప్రశ్నించే గొంతుకకు, ధిక్కార స్వభావానికి పర్యాయపదం… కాళోజీ. 1914-18 మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో పుట్టి ఉద్యమాలలో జీవించారు. స్వరాజ్య సమరం, రెండో ప్రపంచ యుద్ధం, తెలంగాణ సాయుధ పోరాటం, రజాకార్ల దుష్కృత్యాలు, సమైక్య పాలకుల పక్షపాత ధోరణి, తెలంగాణ మలిదశ ఉద్యమం వంటి అనేక కీలక సంఘటనలతో జీవించి స్పందించి పోరాడిన యోధుడు కాళోజీ తెలంగాణ తుది దశపోరాటం ఉవ్వెత్తున జరిగే సమయంలో కాళోజీ దివికేగారు.
కాళోజీ.”పుట్టుక నీది..చావు నీది.. బతుకుంతా దేశానిది” అని లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ గురించి కాళోజీ రాసినప్పటికీ వాస్తవానికి ఆ మాటలు కాళోజీ జీవితానికి సరిగ్గా సరిపోతాయనడంలో అతిశయోక్తి లేదు. ఆయన తన కవిత్వంలో నాటి సమాజంలో తెలంగాణ ప్రజలపై, తెలంగాణ భాషపై, తెలంగాణ సంస్కృతిపై జరుగుతున్న దాడిని నిరసించారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు తెలంగాణ పట్ల చూపుతున్న వివక్షపై తన రచనలలో నిప్పులు చెరిగారు.. దోపిడి చేసే ప్రాంతేతరులను పొలిమేర దాకా తన్ని తరుముదాం.. ప్రాంతం వాడే దోపిడి చేస్తే ప్రాణంతోనే పాతర వేద్దాం” అని సమాజంలోని అసమానతలను దోపిడి వ్యవస్థలపై కాళోజీ గర్జించారు…’తెలంగాణ వేరైతే దేశానికి ఆపత్తా..? తెలంగాణ వేరేతే తెలుగు భాష మరుస్తారా..?” అంటూ ప్రశ్నించి తెలంగాణ ఏనాటికైనా స్వరాష్ట్రం అవుతుందని ముందే ఊహించిన నిఖార్సైన వ్యక్తి.. కాళోజీ.
తెలంగాణ వాదాన్ని వినిపించినంత మాత్రాన ఆయన తెలంగాణకే పరిమితం కాలేదు.కాళోజీ రచనలను ప్రేమించని వారు ఉండరు..ఒక జాతి పట్ల జరుగుతున్న వివక్షను, అన్యాయాన్ని ఎలుగెత్తిన స్వాభిమానిగా ఆయన్ని ప్రాంతాలకు అతీతంగా అభిమానించారు..జీవితాంతం ఉద్యమ కవితాన్ని వినిపిస్తూ..తెలంగాణ ప్రజలలో స్వరాష్ట్ర ఆకాంక్షను రగిలిస్తూ..అన్ని ప్రాంతాల ప్రజల అభిమానాన్ని చూరగొన్న విశ్వజనీన కవి కాళోజీ.ఇప్పుడు ఆయన రచనల్ని మరింతగా ప్రజల చేరువకు చేర్చవలిసి ఉంది. వీర తెలంగాణ నాది-వేర తెలంగాణ నాది. తెలంగాణ వేరై నిలిచి భారతాన వెలియు ముమ్మాటికీ” అని ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆయన పలికిన పలుకులు నేడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో నిజం అయ్యాయి. బతుకంతా తెలంగాణ కోసం తపిస్తూ , తన రచనల ద్వారా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్లో ఉద్యమ చైతన్యాన్ని రగిలించిన అక్షర యోధుడు కాళోజీ నారాయణరావు పేరుతో తెలంగాణ ప్రభుత్వం కాళోజీ యూనివర్సిటీ ని ఏర్పాటు చేసింది. అలాగే ఆ ప్రజాకవి పేరు మీదుగా ఓ అవార్డును తెలంగాణ కవులకు, గాయకులకు ప్రతి ఏటా అందిస్తోంది. అంతకంటే గొప్ప విషయం..తెలంగాణ ప్రజల వాడుక భాషలోనే తన రచనలు గావిస్తూ..తెలంగాణ భాష గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన కాళోజీకి గౌరవసూచకంగా ఆయన జయంతి రోజునే తెలంగాణ భాషా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తోంది. ఒక్క సిరా చుక్కతో నాలుగు కోట్ల ప్రజల్లో ఉద్యమ చైతన్యాన్ని రగిలిచిన ప్రజాకవి శ్రీ కాళోజీ వర్థంతి సందర్భంగా ఆ మహనీయుడికి దరువు.కామ్ తరుపున ఇదే మా అక్షర నివాళి.