కారు ప్రమాదంలో తనకు ఎటువంటి గాయాలు కాలేదని, క్షేమంగా ఉన్నానని హీరో డాక్టర్ రాజశేఖర్ తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు కారుతో తననొక్కడినే ఉన్నానని వెల్లడించారు. అయితే ప్రమాదానికి గల కారణాలను ఆయన తెలపలేదు. అయితే అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు.
బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మంగళవారం రాత్రి రామోజీ ఫిల్మ్‌సిటీ నుంచి ఇంటికి వస్తుండగా ఔటర్ రింగు రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద నా కారు ప్రమాదానికి గురైంది. అప్పుడు కారులో నేను ఒక్కడినే ఉన్నాను. ఎదురుగా వస్తున్న కారులో వారు ఆగి, నా కారు దగ్గరకు వచ్చారు. లోపల ఉన్నది నేనే అని గుర్తు పట్టి, విన్ షీల్డ్ లోనుంచి బయటకు లాగారు. అప్పుడు నేను వెంటనే వారి ఫోన్ తీసుకుని మొదట పోలీసులకు, తర్వాత నా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అక్కడ నుంచి వారి కారులో ఇంటికి బయలు దేరాను. జీవిత, మా కుటుంబ సభ్యులు ఎదురు వచ్చి, నన్ను పికప్ చేసుకున్నారు. నాకు ఎటువంటి గాయాలు కాలేద’ని అన్నారు. అయితే రాజశేఖర్ కారు ప్రమాదంపై శంషాబాద్ పోలీసులు స్పందించారు. ఔటర్ రింగ్ రోడ్డులో పెద్ద గోల్కొండ టోల్ గేట్ వద్ద అదుపు తప్పి కారు బోల్తా కొట్టిందని శంషాబాద్ రూరల్ సీఐ వెంకటేష్ తెలిపారు. కారు(టీఎస్ 07 ఎఫ్‌జడ్ 1234)లో హీరో రాజశేఖర్ ఒక్కరే ఉన్నారని చెప్పారు.అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. రాజశేఖర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయని వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కారును తొలగించి పోలీస్ స్టేషన్‌కు తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.