కర్నూలు జిల్లాలో టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో జగన్ హవాతో 10 కు పది స్థానాలు గెల్చుకుని వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది. టీడీపీ జిల్లాలో అన్ని స్థానాల్లో ఓడిపోయి పరువు పోగొట్టుకుంది. ఇక ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు సీమ జిల్లాల్లో టీడీపీని పూర్తిగా ముంచేస్తోంది. రాజధాని తరలింపు విషయంలో చంద్రబాబు వ్యవహరించిన తీరు..ముఖ్యంగా సీమ టీడీపీ నేతలు అమరావతికి మద్దతు ఇవ్వడంతో సీమ జిల్లాల ప్రజల్లో టీడీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ముఖ్యంగా కర్నూలులో హైకోర్ట్ ఏర్పాటు విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉన్నా..టీడీపీ అధినేత చంద్రబాబు తీర్పుపై జిల్లా ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు సీఎం జగన్ ప్రజా సంక్షేమ పాలనపై సీమ ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతోంది. అలాగే జగన్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు టీడీపీకి చెందిన కుటుంబాలకు కూడా అందుతున్నాయి. తమ ప్రభుత్వ హయాంలో వైసీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాకు ఒక్క పైసా ఇవ్వకుండా, వైసీపీ కార్యకర్తలకు ఒక్క పథకం అందకుండా చంద్రబాబు వ్యవహరించిన తీరును..ఇప్పుడు జగన్ సర్కార్‌లో పార్టీలకతీతంగా తమకు అందుతున్న సంక్షేమ పథకాలను తెలుగుతమ్ముళ్లు బేరీజు వేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో జిల్లాలో మరో పదేళ్ల వరకు టీడీపీకి భవిష్యత్తు ఉండదని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో తమ రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేరకు ఇవాళ టీడీపీకి చెందిన 300 కుటుంబాలు వైసీపీలో చేరాయి. కర్నూలు జిల్లాలోని దేవనకొండలో టీడీపీకి చెందిన 300 కుటుంబాలు ఇవాళ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం సమక్షంలో వారంతా పార్టీలో చేరారు. సీఎం జగన్ ప్రజారంజక పాలనకు ఆకర్షితులై వైసీపీలో చేరామని టీడీపీ నేతలు తెలిపారు. మొత్తంగా కర్నూలు జిల్లాలో టీడీపీ ఖాళీ అవడం ఖాయంగా కనిపిస్తోంది.