టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి సారథ్యంలోని పాలకమండలి మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల కొండపై ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను, ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను పూర్తిగా నిషేధించింది. ఈ మేరకు పటిష్ట చర్యలు తీసుకుంటామని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ఇవాళ మీడియాకు తెలిపారు. తిరుమలకు ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు విచ్చేస్తుంటారు. దీంతో తిరుమలలో ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉంది. తిరుమల కొండపై ఎక్కడ చూసినా వాడిపడేసిన ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, క్యారీ బ్యాగ్‌లు కనిపిస్తున్నాయి.ప్లాస్టిక్ వాడకంతో పారిశుద్ధ సమస్యతో పాటు, పర్యావరణ కాలుష్యం ఎక్కువగా ఉంది. దీంతో టీటీడీ పర్యావరణ పరిరక్షణ కోసం తిరుమలపై ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది. విడతలు వారీగా మూడు దశల్లో ప్లాస్టిక్ బాటిళ్లను నిషేధించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భక్తులే కాకుండా టీటీడీ కార్యాలయాల్లో కూడా ప్లాస్టిక్ బాటిల్స్ వియోగించకుండా తగిన చర్యలు తీసుకుంటామని ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల కొండపై ప్లాస్టిక్ నిషేధంపై భక్తులకు అవగాహన కల్పిస్తామనీ..తిరుమలలోని ఏ రెస్టారెంట్ ల్లో కూడా వాటర్ బాటిళ్లు విక్రయించకుండా కఠిన చర్యలు తీసుకుంటామనీ ఆయన అన్నారు. వాటర్ బాటిళ్లకు బదులు తిరుమల కొండపై ఏర్పాటు చేసిన జల ప్రసాదం నీటిని వాడేలా భక్తులకు సూచనలు చేస్తామని ధర్మారెడ్డి పేర్కొన్నారు. అలాగే లడ్డూలకు ప్లాస్టిక్ క్యారీబ్యాగులకు బదులు పేపర్ బాక్స్‌లు, జూట్ బ్యాగ్‌ల వినియోగించేందుకు చర్యలు తీసుకుంటామని ధర్మారెడ్డి తెలిపారు. మొత్తంగా తిరుమల కొండపై ప్లాస్టిక్ నిషేధాన్ని సంపూర్ణంగా అమలు చేయాలని టీటీడీ అన్ని రకాల చర్యలు తీసుకోవడం అభినందనీయం.
