తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవాడు ఆత్మగౌరవంతో బ్రతకాలని.. ప్రతి ఒక్కరూ సొంతింటిని కలిగి ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యుత్తమ పథకం డబుల్ బెడ్రూం ఇండ్లు. రూపాయి ఖర్చు లేకుండా రాష్ట్రంలోని పేదవారికి డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం నిర్మించి ఇవ్వనున్నది.
అందులో భాగంగా మొత్తం రూ.6,992 కోట్లతో 1.35 లక్షల రెండు పడకల గదుల ఇండ్లను నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మొత్తం ముప్పై ఆరు వేల డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తైంది. మరో తొంబై తొమ్మిది వేల ఇండ్లు నిర్మాణం చివరి దశలో ఉన్నాయి. ఇప్పటికే ముప్పై రెండు వేల డబుల్ బెడ్రూం ఇండ్లలో సామూహిక ప్రవేశాలు జరిగాయి.
అయితే మొత్తం 1,35,000 డబుల్ బెడ్రూం ఇండ్లలో వచ్చే నెలలో ప్రవేశాలు జరగనున్నాయి. అయితే మొత్తం రెండు లక్షల ఎనబై మూడు వేల నాలుగు వందల ఒక ఇండ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. వీటిలో 1,99,353 ఇండ్లకు టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ఆయా కాంట్రాక్టర్లకు అగ్రిమెంట్ చేశారు.
వీటిలో 1,79,078 ఇండ్ల పనులు ప్రారంభమయ్యాయి. ముప్పై రెండు వేల ఇండ్లను ఇప్పటికే లబ్ధిదారులకు అందజేశారు. ఈ నెల ఒకటో తారీఖు వరకు మరో ముప్పై ఆరు వేల నూట ముప్పై ఆరు ఇండ్ల నిర్మాణం పూర్తి చేశారు.మిగిలినవాటిలో ఐదు శాతం పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. వచ్చే నెల మొదటి నాటికి ఇవి కూడా పూర్తి కానున్నాయి.