గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా వ్యవహారం ఇంకా పెండింగ్‌లోనే ఉంది..టీడీపీకి రాజీనామా చేసిన వంశీ వైసీపీలో చేరే విషయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. వంశీ వ్యక్తిగత డిమాండ్లకు సీఎం జగన్ ఇంకా అంగీకారం తెలుపకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. అయితే రెండు, మూడు రోజుల్లో టీడీపీని వీడేందుకు వంశీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. తన రాజీనామాను స్పీకర్‌కు పంపేందుకు వంశీ రెడీ అవుతున్నట్లు సమాచారం. వంశీ రాజీనామా లేఖ సమర్పించిన మరుక్షణం స్పీకర్ ఆమోదించే అవకాశం ఉంది. ఇదే జరిగితే త్వరలో గన్నవరంలో ఉప ఎన్నికలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే వైసీపీ నుంచి గత ఎన్నికల్లో ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు బరిలో దిగుతాడో..లేదా..యార్లగడ్డకు ఎమ్మెల్సీ పదవితో సర్దిచెప్పి..మళ్లీ వంశీనే వైసీపీ తరపున బరిలోకి దింపుతారో అన్నది తెలియాల్సి ఉంది. కాగా టీడీపీ నుంచి మాత్రం గన్నవరం నుంచి పోటీ చేయడానికి సరైన అభ్యర్థి దొరకడం లేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వంశీ రాజీనామా చేసిన సమయంలో టీడీపీ నుంచి గన్నవరం బరిలో దిగేందుకు చాలా మంది అభ్యర్థుల పేర్లు వినిపించాయి. ముఖ్యంగా తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ పేరు వినిపించింది. అయితే అవినాష్ మాత్రం గన్నవరంపై ఆసక్తి చూపడం లేదు..గత సార్వత్రిక ఎన్నికలలో కూడా అవినాష్ పెనమలూరు, విజయవాడ తూర్పు టికెట్ ఆశించాడు. అయితే చంద్రబాబు, దేవినేని ఉమల రాజకీయంతో అవినాష్ అయిష్టంగానే గుడివాడ బరిలో దిగి కొడాలి నానిపై ఓటమి పాలయ్యాడు. ఇప్పుడు గన్నవరంపై కూడా అవినాష్ ఇంట్రెస్ట్‌గా లేడని సమాచారం. ఇక మాజీ జెడ్పీ ఛైర్ పర్సన్ గద్దె అనురాధను గన్నవరం ఉప ఎన్నికల్లో పోటీ చేయించాలని చంద్రబాబు భావించినా..ఆమె భర్త, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాత్రం తాము అక్కడ పోటీ చేసేందుకు సిద్ధంగా లేమని ఏకంగా చంద్రబాబుకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇక టీడీపీకి ఉన్న ఏకైక ఆష్షన్ దేవినేని ఉమ. అయితే గన్నవరం లో స్థానిక టీడీపీ క్యాడర్ దేవినేని ఉమ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గన్నవరంలో రాజకీయాలు ఎలా ఉంటాయో ఉమకు తెలుసు. తాను రిస్క్ చేసి పోటీ చేసినా..తన గెలుపుకు స్థానిక క్యాడర్ సహకరించదని ఉమ భావిస్తున్నాడంట. ఈ నేపథ్యంలో ఉమ కూడా గన్నవరంలో పోటీకి వెనకడుగు వేసే అవకాశం ఉంది. మొత్తంగా గన్నవరంలో ఉప ఎన్నికలు వస్తే టీడీపీకి సరైన అభ్యర్థి దొరికే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. మరి చంద్రబాబు ఎవరిని ఒప్పించి బరిలోకి దింపుతాడో చూడాలి.