ఏపీలో అవినీతిరహిత పాలన అందించేందుకు సీఎం జగన్ నడుం బిగించిన సంగతి తెలిసిందే. ఏపీలో పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అవినీతిని ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని..ఆఖరికి మంత్రులు సైతం అవినీతికి పాల్పడితే నిర్థాక్షిణ్యంగా తొలగించి కఠిన చర్యలు తీసుకుంటామని తొలి కేబినెట్ సమావేశంలోనే సీఎం జగన్ హెచ్చరించారు. గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో పోలవరం, వెలిగొండ వంటి పలు సాగునీటి ప్రాజెక్టులు, వివిధ ప్రభుత్వ శాఖల్లో భారీగా అవినీతి జరిగిందని భావించిన సీఎం జగన్ పాత టెండర్లు రద్దు చేసి రివర్స్ టెండరింగ్ వెళ్లారు. తద్వారా ప్రభుత్వ ఖజనాకు దాదాపు 1200 కోట్లు ఆదా చేశారు. తాజాగా ఏపీలో అవినీతిని పూర్తిగా నియంత్రించే చర్యల్లో భాగంగా సీఎం జగన్..ఏసీబీకి పూర్తి స్వేచ్చనిస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. వచ్చే రెండు మూడు వారాల్లో ఏసీబీని పెద్ద ఎత్తున రంగంలోకి దించుతున్నామని సీఎం జగన్ స్వయంగా వెల్లడించారు. ఎక్కడ అవినీతి జరిగినా సహించేది లేదనే విషయం ప్రతి ఒక్కరికి చేరాలని సీఎం జగన్ ఏసీబీకి నిర్దేశించారు. ఏసీబీ కేసుల విషయంలో ఎవరు జోక్యం చేసుకున్నా అవినీతి విషయంలో రాజీ పడవద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వచ్చే వారం నుండి ఏపీలో పెద్ద ఎత్తున దాడులను నిర్వహించేందుకు ఏసీబీ సిద్ధమవుతుంది. ఈ మేరకు అదనపు సిబ్బందిని సైతం సమకూర్చుకుంటోంది. ఇప్పటికే ఏసీబీ వద్ద అవినీతిపరులైన అధికారులు, నేతల హిట్‌లిస్ట్ ఉందని సమాచారం. వారం రోజుల్లో ఏసీబీ ఏ స్థాయిలో దాడులు జరుపబోతుంది..ఏసీబీ హిట్ లిస్టులో ఎవరెవరు ఉన్నారనేది ఇప్పుడు ఏపీ రాజకీయ, అధికారవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. మొత్తంగా గత ఐదేళ్ల బాబుగారి హయాంలో టీడీపీ నేతలతో కుమ్మక్కై భారీగా అవినీతికి పాల్పడి కోట్లాది రూపాయలు వెనుకేసుకున్న అధికారుల గుండెల్లో ఏసీబీ దాడుల వ్యవహారం గుబులు పుట్టిస్తోంది. మరి ఎవరెవరు ఏసీబీ దాడుల్లో పట్టుబడతారో తెలియాలంటే మరో వారం రోజులు వరకు ఆగాల్సిందే.
