అయోధ్యలో వివాదాస్పద 2.7 ఎకరాల భూమి హిందూవులకే చెందుతుందని, ముస్లింలకు అయోధ్యలోనే 5 ఎకరాలు మసీదు నిర్మించుకునేందుకు ఇవ్వాలని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు తీర్పును కుల, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్వాగతించారు. ముస్లిం లా బోర్డు వంటి ముస్లిం సంస్థలు కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినా కోర్టు తీర్పును గౌరవిస్తామని ప్రకటించాయి. కాగా తాజాగా ఏ మొఘలు చక్రవర్తుల కాలంలో అయోధ్యలో మసీదు నిర్మాణం జరిగిందని చరిత్ర చెబుతుందో..అదే మొగలు చక్రవర్తుల వారసులు సుప్రీం కోర్ట్ తీర్పుపై హర్షం వ్యక్తం చేసి రామమందిరం నిర్మాణానికి ముస్లింలు కూడా సహకరించాలని పిలుపునివ్వడం సంచలనంగా మారింది. అయోధ్య కేసులో సుప్రీంకోర్టు శనివారం ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనదని చివరి మొగలు చక్రవర్తి బహుదూర్‌షా వారసుడు ప్రిన్స్ యాకుబ్ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పును దేశంలోని ప్రజలందరూ సంతోషంగా స్వాగతించాలని అన్నారు. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించేందుకు హిందువులు, ముస్లింలు కలిసి ముందుకు రావాలని, . అప్పుడే నిజమైన సెక్యూలరిజమ్, మత సామరస్యం ప్రపంచం ముందు ఉంచినట్లవుతుందని ఆయన అన్నారు అయోధ్యలోని రామమందిర నిర్మాణానికి తాను స్వయంగా బంగారు ఇటుక ఇస్తానని హామీ ఇచ్చానని, ఆలయ నిర్మాణానికి పునాది వేయగానే.. ప్రధాని నరేంద్ర మోడీని కలిసి బంగారు ఇటుకను బహూకరిస్తానని ప్రిన్స్ యాకుబ్ చెప్పారు. మొత్తంగా అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై మొగలు చక్రవర్తుల వారసులు కూడా హర్షం వ్యక్తం చేయడం గమనార్హం.
