అయోధ్య కేసులో సుప్రీం కోర్ట్ తీర్పుపై యావత్ దేశం స్పందించిన తీరుకు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..134 ఏళ్లుగా నలుగుతున్న ఈ వివాదానికి ఇకనైనా తెరపడాలని దేశ ప్రజలు ఎంత బలంగా కోరుకున్నారో..నిన్న తీర్పు తర్వాత చూపించిన పరిణితి.. లౌకిక, ప్రజాస్వామ్య భారత గొప్పతనాన్ని చాటుతోంది. ఈ దేశంలో మతాలు వేరైనా మనుష్యులుగా కలుసుంటామని దేశ ప్రజలు నిరూపించారు. ముఖ్యంగా తమకు అనుకూలంగా తీర్పు రాకపోయినా ముస్లిం సమాజం స్పందించిన తీరు నిజంగా అభినందనీయం. నిన్న అయోధ్య కేసుపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై హిందువులే కాదు ముస్లింలు కూడా సంబరాలు చేసుకోవడం గమనార్హం. నిన్న ఉదయం తీర్పు వెలువడగానే అస్సామీ ముస్లింలు బాణా సంచాను కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయోధ్యలో వివాదాస్పద భూమి హిందూవులకే కేటాయించడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన అస్సామీ ముస్లిములు ఏకంగా రామమందిరం నిర్మాణానికి తమ వంతుగా రూ. 5 లక్షలు విరాళం ఇస్తామని ప్రకటించారు. అయితే ఈ అస్సామీ ముస్లింలంతా రెక్కాడితే కాని డొక్కాడని చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారం చేసే వారు కావడం గమనార్హం. రామ మందిరం నిర్మాణం కోసం రూ. 5 లక్షల విరాళం ఇచ్చేందుకు స్థానిక 21 ముస్లిం సంఘాలు జొనొగుస్తియా సొమొనోయ్ పరిషద్ అసోం (జేఎస్పీఏ) అసోసియేషన్ గా ఏర్పడ్డారు. రామ మందిరం నిర్మాణానికి శంకుస్థాపన చేసే సమయానికి రూ. 5 లక్షలు ఇచ్చేందుకు ఇప్పటి నుంచే రూపాయి, రూపాయి పోగు చేస్తామని ముస్లింలు తెలిపారు.మొత్తంగా అయోధ్యలో వివాదాస్పద ప్రాంతం రాముడికే కేటాయించడం పట్ల ముస్లింలు కూడా సంబరాలు చేసుకోవడం చూస్తుంటే..ఇది కదా మన సెక్యులర్ ఇండియా అని గర్వంగా చెప్పుకోక తప్పదు.ఒక్క అస్సామీ ముస్లింకే కాదు..అయోధ‌్య కేసులో సుప్రీం కోర్ట్ తీర్పు వచ్చిన తర్వాత అత్యంత పరిణితి ప్రదర్శించిన ప్రతి భారతీయ ముస్లింకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.