అయోధ్య కేసులో సుప్రీంకోర్ట్ ఇవాళ చారిత్రాత్మక తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. అయోధ్యలో వివాదాస్పదమైన 2.7 ఎకరాల భూమి రామజన్మభూమి న్యాస్ ట్రస్ట్‌కు మూడునెలల్లోగా అప్పగించాలని కేంద్రాన్ని ఆదేశించిన ధర్మాసనం అదే సమయంలో ముస్లింలకు ప్రత్యామ్నాయంగా అయోధ్యలో 5 ఎకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్‌బోర్డ్‌కు అప్పగించాలని తీర్పు చెప్పింది. సుప్రీంకోర్ట్ తీర్పుపై సున్నీవక్ఫ్ బోర్డ్ న్యాయవాది జఫర్‌యాబ్ జిలాని స్పందించారు. సుప్రీం కోర్టు తీర్పుతో సంతృప్తి చెందలేదని చెప్పిన ఆయన..అయితే తీర్పును మాత్రం గౌరవిస్తున్నామని అన్నారు. తీర్పు కాపీని పూర్తిగా చదివిన తర్వాత సుప్రీం తీర్పుపై రివ్యూ పిటీషన్ వేయాలో లేదో నిర్ణయించుకుంటామని ముస్లిం లాబోర్ట్ ప్రకటించింది. ఏఎస్‌ఐ నివేదికలో ముస్లింలకు అనుకూలంగా ఉన్న అంశాలను కోర్టు పట్టించుకోలేదని, కమిటీతో చర్చించిన తర్వాతే వారి నిర్ణయం మేరకు రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని వెల్లడించింది. మొత్తంగా దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన అయోధ్య కేసుపై సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పును మాత్రం గౌరవిస్తామని..అందరూ సమన్వయం పాటించాలని ముస్లింలా బోర్డ్ ప్రకటించింది.
