కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న ఓ వివాదం ఒక ముగింపునకు వచ్చే సమయం ఆసన్నమైంది. అయోధ్యలోని వివాదాస్పద రామజన్మ భూమి-బాబ్రీమసీదు వ్యాజ్యంపై శనివారం తుది తీర్పు వెలువరించేందుకు సుప్రీంకోర్టు సిద్ధమైంది. ఈ వ్యాజ్యంపై 40 రోజులపాటు రోజువారీ విచారణ జరిపిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం అక్టోబరు 16న తీర్పును వాయిదా వేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నవంబరు 17న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆలోగా తుది తీర్పు వెలువడుతుందనే అంచనా ఉందిగానీ.. ఏ రోజు అనే విషయమై ఇన్నాళ్లూ స్పష్టత లేదు. కానీ అనూహ్యంగా.. శనివారం ఉదయం 10:30 గంటలకు తీర్పు వెలువరించేందుకు సుప్రీం కోర్టు సిద్ధమైంది.
సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్.. ఉత్తరప్రదేశ్ సీఎస్ రాజేంద్రకుమార్ తివారీ, డీజీపీ ఓంప్రకాశ్‌తో శుక్రవారం తన చాంబర్‌లో మాట్లాడారు. భద్రతా ఏర్పాట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. తీర్పు వచ్చాక అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉండడంతో దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌కు కేంద్ర హోంశాఖ గురువారమే 40 కంపెనీల పారామిలటరీ బలగాలను తరలించింది. అయోధ్య తీర్పు నేపథ్యంలో.. ఈ వ్యాజ్యాన్ని విచారిస్తున్న రాజ్యాంగ ధర్మాసనంలోని ఐదుగురు న్యాయమూర్తుల భద్రతను జడ్ ప్లస్ కేటగిరీకి పెంచారు. మరోవైపు.. అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీమసీదుకు వెళ్లే అన్ని దారులనూ పోలీసులు మూసివేశారు. యూపీ సర్కారు అయోధ్యలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా పటిష్ఠమైన, బహుళ అంచెల భద్రతా ఏర్పాట్లు చేసింది. 60 కంపెనీల బలగాలను మోహరించింది. పరిస్థితిని పర్యవేక్షించడానికి 30 కీలక ప్రాంతాల వద్ద పోలీసులు 10 డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేశారు.
అయోధ్య వివాదంపై శనివారం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో తెలంగాణ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న ఘటనకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై డీజీపీ మహేందర్‌రెడ్డి, అదనపు డీజీపీ జితేందర్… పోలీసు కమిషనర్లు, ఎస్పీలకు సూచనలు చేశారు. హైదరాబాద్‌తో పాటు ఇతర సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. ఈ తీర్పు శనివారం వెలువడుతున్న నేపథ్యంలో అక్కడ ఒకరకమైన ఉద్వేగంతో కూడిన నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. తీర్పు ఎలా వచ్చినా సరే దాన్ని స్వాగతించాలన్న.. 1992 నాటి హింస పునరావృతం కారాదన్న కృతనిశ్చయం అయోధ్య వాసుల్లో వ్యక్తమవుతోంది. తీర్పు తర్వాత ఘర్షణలు తలెత్తినా అవి బయటివారి వల్లనే తప్ప.. తమ వల్ల ఎలాంటి హింస తలెత్తదని స్థానికులు ముక్తకంఠంతో చెబుతున్నారు