*అయోధ్యలో ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలాన్ని ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది.
*వివాదాస్పద భూభాగాన్ని అలహాబాద్ హైకోర్టు విభజించడం ఆమోదయోగ్యం కాదని సుప్రీం స్పష్టం చేసింది.
*మసీదు కూల్చివేత చట్టవిరుద్ధమని పేర్కొంది.
బాబ్రీ నిర్మాణం సుప్రీం ప్రధాన న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ అంతర్గత నిర్మాణం ఇస్లామిక్ శైలిలో లేదని వ్యాఖ్యానించారు. నిర్మోహి అఖాడా వాదనను కోర్టు తోసిపుచ్చింది. సున్నీ వక్ఫ్ బోర్డు తరుచూ మాటమార్చిందన్నారు. మసీదు కింద 12వ శతాబ్దం నాటి భారీ పురాతన కట్టడ ఆనవాళ్లు ఉన్నాయన్న ఏఎస్ఐ వాదనలను తోసిపుచ్చలేమని తెలిపారు. అయితే అది రామాలయమని ఏఎస్ఐ ఆధారాలు చూపలేదన్నారు. మొగల్ చక్రవర్తి బాబర్ దగ్గర పని చేసిన సైనికాధికారులు మసీదును నిర్మించారని అన్నారు. బాబ్రీ మసీద్ నిర్మాణ తేదీపై స్పష్టత లేదని, విగ్రహాలు మాత్రం 1949లో ఏర్పాటు చేశారని సీజేఐ అన్నారు.
దశాబ్దాల కాలం పాటు వివాదాలు, న్యాయస్థానాల మధ్య నలిగిన రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీం కోర్టు చారిత్రాత్మకమైన తీర్పును వెల్లడించింది. అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామజన్మభూమి న్యాస్‌కు అప్పగించాలని, అప్పటి వరకు ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని సంచలన తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో అయోధ్య యాక్ట్ కింద ట్రస్ట్ మూడు నెలల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలం ఇవ్వాలని సూచించింది. స్థలాన్ని సున్నీ బోర్డుకు ఇవ్వాలని ఆదేశించింది. భూ కేటాయింపునకు కేంద్రం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని తెలిపింది. 1993లో ప్రభుత్వం సేకరించిన స్థలంలో అయినా సున్నీ బోర్డుకు స్థలాన్ని కేటాయించవచ్చని పేర్కొంది.
జస్టిస్ గొగోయ్, జస్టిస్ బాబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్‌ఏ నజీర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం భిన్నాభిప్రాయాలను తావు లేకుండా ఒకే తీర్పు ఇచ్చింది. షియా వక్ఫ్ బోర్డు, అఖాడా వాదనలను న్యాయస్థానం తోసిపుచ్చింది. యాజమాన్య హక్కులు కోరుతూ షియా వక్ఫ్ బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. వివాదాస్పద భూభాగాన్ని అలహాబాద్ హైకోర్టు విభజించడం ఆమోదం కాదని సుప్రీం స్పష్టం చేసింది. మసీదు కూల్చివేత చట్టవిరుద్ధమని సీజేఐ వ్యాఖ్యానించారు.