దాదాపు కొన్ని దశాబ్దాల కాలం పాటు పలు వివాదాలు, న్యాయస్థానాల మధ్య నలిగిన రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు ఈ రోజు శనివారం అత్యంత చారిత్రాత్మకమైన తీర్పును వెల్లడించింది. అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామజన్మభూమి న్యాస్‌కు అప్పగించాలి.అప్పటి వరకు ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి అంటూ జస్టిస్ గొగోయ్, జస్టిస్ బాబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్‌ఏ నజీర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం సంచలన తీర్పు ఇచ్చింది.
ఈ క్రమంలో అయోధ్య యాక్ట్ కింద ట్రస్ట్ మూడు నెలల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలం ఇవ్వాలని సూచించింది. స్థలాన్ని సున్నీ బోర్డుకు ఇవ్వాలని కూడా ఆదేశించింది. భూ కేటాయింపునకు కేంద్రం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని తెలిపింది. 1993లో ప్రభుత్వం సేకరించిన స్థలంలో అయినా సున్నీ బోర్డుకు స్థలాన్ని కేటాయించవచ్చని ఈ సందర్భంగా పేర్కొంది.
దీనిపై ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ”అయోధ్యపై దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు తీర్పును అందరూ గౌరవించాలి.ఎలాంటి విభేధాల్లేకుండా అందరూ కలిసి మెలసి ఉండాలి. ఎవ్వరూ కూడా ఎటువంటి భావోధ్వేగాలకు లోను కావద్దు.. సమాజంలో శాంతి సామరస్య స్థాపనకు ప్రజలంతా ఐక్యంగా ఉండాలని”బాబు సూచించారు.