ఏపీలో ఇసుక కొరతపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు జగన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లోకేష్ మంగళగిరిలో ఇసుక కొరతపై నాలుగు గంటల పాటు నిరాహారదీక్ష చేస్తే..పవన్ కల్యాణ్ వైజీగ్‌లో రెండున్నర కి.మీ. లాంగ్ మార్చ్ చేశాడు. లాంగ్ మార్చ్ అంటే నడిచాడని కాదు…తన కారు మీద నిలబడి అభిమానులకు అభివాదం చేస్తూ, కార్ మార్చ్ చేశాడు. ఇక బాబుగారు కూడా విజయవాడలో ఈ నెల 14 న పది గంటల పాటు పాటు నిరాహారదీక్ష చేస్తున్నట్లు ప్రకటించాడు. బాబు, లోకేష్, పవన్‌ల ఇసుక రాజకీయాలపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ధీటుగా కౌంటర్లు ఇస్తున్నారు.. తాజాగా వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా ఇసుక డ్రామాలు చేస్తున్న పార్టనర్లపై మండిపడింది. చంద్రబాబు పవన్ కల్యాణ్‌లపై తీవ్ర విమర్శలు చేసింది. ఎన్నికల్లో ఓటమి కారణంగా చంద్రబాబుకు మతిభ్రమించినట్టుందని, చిన్న మెదడు చితికిందని రోజా ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎప్పడు అధికారంలోకి వచ్చినా కరువు, కాటకాలు, లేకుంటే తుఫాన్లు అతలాకుతలం చేసేవని..కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ వచ్చిన తర్వాత ఏపీలో విస్తారంగా వర్షాలు కురిసాయని..అందుకే ఇసుక కొరత ఏర్పడిందని రోజా చెప్పుకొచ్చారు. అయితే ఇసుక కొరతపై చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని రోజా ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష నేతలు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి అని ఆమె హితవు పలికారు. ఏపీలో వైయస్ జగన్ పాలన చూసి ఇరుగు పొరుగు రాష్ట్రాల వారు కూడా తమకు ఇలాంటి ముఖ్యమంత్రే రావాలని కోరుకుంటున్నారని రోజా చెప్పారు. మొత్తంగా చంద్రబాబుకు చిన్న మెదడు చితికింది అంటూ..ఆర్కే రోజా వేసిన సెటైర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
