వైయస్సార్ కడపజిల్లాలో నిర్మించ తలపెట్టిన స్టీల్‌ప్లాంట్‌కు ఎన్‌ఎండీసీ నుంచి ఇనుపఖనిజం సరఫరాపై ముఖ్యమంత్రి జగన్ చేసిన విజ్ఞప్తిపై కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు గనుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ సానుకూలంగా స్పందించారు. ఎన్‌ఎండీసీ నుంచి ఇనుప ఖనిజాన్ని సరఫరాచేయడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. దీనిపై రాష్ట్రప్రభుత్వం, ఎన్‌ఎండీసీ మధ్య త్వరలో ఒప్పందం కుదరనుంది. సచివాలయంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్, ప్రభుత్వరంగ చమురు కంపెనీలకు సంబంధించిన సీనియర్ అధికారులు, ఉక్కుశాఖ అధికారులతో ముఖ్యమంత్రి వైయస్.జగన్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సమావేశమయ్యారు. ఆయా శాఖలకు సంబంధించి పెండింగులో ఉన్న అంశాలు, దృష్టిపెట్టాల్సిన అంశాలను రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు వివరించారు. ఇందులోని ముఖ్యాంశాలివే.
- పునర్వివిభజన చట్టం ప్రకారం కడపలో స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉందని, దీనికోసం ప్రపంచంలోని ప్రఖ్యాత ఉక్కుకంపెనీలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని వివరించారు. ప్లాంటు నిర్వహణలో స్థిరత్వం సాధించడానికి నిరంతరాయంగా ఇనుపఖనిజాన్ని సరఫరాచేయాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ సానుకూలంగా స్పందించారు. ఏపీ ప్రభుత్వం ఎన్‌ఎండీసీ ఒప్పందం చేసుకుంటుందని వెల్లిడించారు. త్వరలోనే దీనిపై ఎంఓయూ కుదర్చుకోవాలని కేంద్ర ఉక్కుశాఖ అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
2.తూర్పుగోదావరి జిల్లా పోలవరం మండలం బైరవపాలెంలో జీఎస్‌పీసీ లిమిటెడ్ నిర్వహించిన ఆఫ్‌షోర్ డ్రిల్లింగ్ వల్ల 16,554 మత్స్యకార కుటుంబాలకు చెల్లించాల్సిన రూ.81 కోట్ల రూపాయలు పెండింగులో ఉన్నాయని, వాటిని వెంటనే మంజూరుచేయాలని విజ్ఞప్తిచేశారు. ఈ పరిహారం చెల్లింపునకు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రమంత్రి ప్రదాన్ ఓఎన్జీసీ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
- చమురు, గ్యాస్ కంపెనీలు ఏపీలో తమ టర్నోవర్‌కు తగినట్టుగా సీఎస్‌ఆర్ నిధులు ఇవ్వాలంటూ చేసిన విజ్ఞప్తిపైనా కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో ఆయా కంపెనీల టర్నోవర్ మేరకే సీఎస్‌ఆర్ వచ్చేలా చూస్తామని కేంద్రమంత్రి స్పష్టంచేశారు.
- చమురు, గ్యాస్ వెలికి తీస్తున్న కంపెనీలు చెల్లిస్తున్న రాయల్టీలో రాష్ట్రానికి వాటా ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరింది. ఆఫ్‌షోర్‌లో చమురు, గ్యాస్ వెలికితీత కార్యక్రమాల వల్ల సమీపంలో ఉన్న ప్రాంతాల్లో కాలుష్య ప్రభావం ఉంటోందని, తీర ప్రాంతాల్లో ఉన్న ప్రాసెసింగ్ ప్లాంట్ల వల్ల పర్యావరణ పరంగా క్లిష్టపరిస్థితులు ఏర్పడుతున్నాయని, భారీ వాహనాల రాకపోకల వల్ల రోడ్లు దెబ్బతింటున్నాయని, ప్రజలు, మత్స్యకారుల జీనోపాధికికూడా ఇబ్బంది వస్తోందని రాష్ట్రప్రభుత్వం కేంద్రమంత్రి దృష్టికి తీసుకు వెళ్లింది.
- ఆంధ్రప్రదేశ్ పునర్వివిభజన చట్టం ప్రకారం క్రూడాయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ను తప్పనిసరిగా ఏర్పాటుచేయాల్సి ఉందని, కాకినాడలో ఏర్పాటుకు సత్వర చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ అధికారులు కేంద్రమంత్రికి విజ్ఞప్తిచేశారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి పెట్రోలియంశాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో అత్యున్నతస్థాయి సంయుక్త కమిటీని ఏర్పాట చేస్తామని వెల్లడించారు. పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటుకు తగిన ప్రణాళిక సిద్ధంచేస్తామని చెప్పారు.
- కాకినాడ, రాజమండ్రి ప్రాంతాల్లో పెట్రోలియం ఎక్స్‌లెన్స్ సెంటర్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తామని «కేంద్రమంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రదాన్ ఇదే సమావేశంలో వెల్లడించారు.
- దేశానికి తూర్పుతీరంలో ఉన్న ఏపీలో పెట్రో రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచప్రఖ్యాత కంపెనీలు ముందుకు వస్తున్నాయని శ్రీ ప్రదాన్ అన్నారు. వచ్చే ఐదేళ్లలో పెట్రోలు, సహజవాయువు, ఉక్కు రంగాలకు సంబంధించి దాదాపు రూ.2 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు రానున్నట్టు తెలిపారు. విశాఖలో విస్తరణ ప్రాజెక్టుల ద్వారా, కాకినాడలో పెట్రోకాంప్లెక్స్ ఏర్పాటు ద్వారా, కడపలో స్టీల్ ప్లాంట్ రూపంలో భారీగా పెట్టుబడులు వస్తాయని శ్రీ ప్రదాన్ వెల్లడించారు. పరిశ్రమల ఏర్పాటు విషయంలో ఏపీ ప్రభుత్వం ఓపెన్ మైండ్‌తో ఉందని అన్నారు.
- పైపులైన్లు వేయడంలో ఉన్న సమస్యలను తొలగించడంతోపాటు, చాలాకాలంగా పెండింగులో ఉన్న సమస్యలను పరిష్కరించినందుకుఓఎన్జీసీ , హెచ్‌పీసీఎల్ ఛైర్మన్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
- రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం శ్రీ జగన్ అన్నారు. పరిశ్రమల ఏర్పాటు విషయంలో సానుకూల దృక్పథంతో ఉంటామని, ఏది కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
- సమావేశంలో కేంద్ర ఉక్కుశాఖ కార్యదర్శి బినోయ్‌రాయ్, పెట్రోలియంశాఖ సంయుక్త కార్యదర్శి అమర్‌నాథ్, ఎన్‌ఎండీసీ సీఎండీ ఎన్.బైజేంద్రకుమార్, గెయిల్ సీఎండీ అశుతోష్ కర్ణాటక్, ఓఎన్జీసీ సీఎండీ శశి శంకర్, హెచ్‌పీసీఎల్ సీఎండీ ముఖేష్ కుమార్ సురానా, ఆర్‌ఐఎన్‌ఎల్ సీఎండీ పి.కె.రథ్ పాల్గొన్నారు.