యాదాద్రి భువనగిరి జిల్లా లోని సంస్థాన్ నారాయణపురం గ్రామం లో ఏర్పాటుచేసిన బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ విగ్రహాన్ని ఆబ్కారీ, టూరిజం శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, విప్ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ ధర్మభిక్షం గారు 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా తన జీవితం మొత్తాన్ని ప్రజాసేవకే అంకితం చేశారన్నారు. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి అనిర్వచనీయమన్నారు. ధర్మభిక్షం తో కలిసి తను పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు మంత్రి తెలిపారు. ఆయన్ని కలిసిన ప్రతిసారి గౌడ సోదరుల అభ్యున్నతి కోసం చేయాల్సిన కార్యాచరణ గురించి మాట్లాడే వారన్నారు. గౌడ సోదరులు అత్యంత దుర్భరమైన స్థితిలో జీవితాలు గడుపుతున్నారని వారి జీవన ప్రమాణాలను పెంచేందుకు పాలకవర్గాలు కృషి చేయడం లేదని ఆవేదన చెందేవారనీ తెలిపారు.
ప్రభుత్వాలు నీరా పాలసీ తీసుక రావటం వల్ల గౌడ కులస్థులను ఆదుకోవాలని ప్రస్తుతించేవారన్నారు. ధర్మభిక్షం ఆశయాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం నీరా పాలసీ తీసుకువచ్చినట్లు తెలిపారు. గీత కార్మికులకు 2000 రూపాయల పింఛను ఇచ్చిన ఘనత తమదే అన్నారు. గత పాలకవర్గాలు గీత కార్మికులు మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకో లేదన్నారు, కానీ తమ ప్రభుత్వం గీత కార్మికులు దురదృష్టవశాత్తు మరణిస్తే ఐదు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లిస్తున్నట్లు తెలిపారు.
ప్రమాదవశాత్తు పూర్తి అంగవైకల్యానికి గురైన కార్మికులకు కూడా 5 లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తున్నట్లు తెలిపారు, గాయం అయినవారికి పదివేల రూపాయలు ప్రభుత్వం నుండి కార్మికులకు పరిహారంగా ఇస్తున్నట్లు తెలిపారు. ఆజన్మాంతం ప్రజాసేవకే అంకితమైన ధర్మభిక్షానికి భారతరత్న అవార్డు ఇచ్చే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ మరియు గౌడ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు