హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఎ–2 డివిజన్ రెండు రోజుల లీగ్‌లో మహబూబ్‌నగర్ బ్యాట్స్‌మన్ జి. గణేశ్ (192 బంతుల్లో 329; 40 ఫోర్లు, 15 సిక్సర్లు) దూకుడైన ట్రిపుల్ సెంచరీతో కదం తొక్కాడు. ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. గణేశ్ వీర విధ్వంసంతో బుధవారం డబ్ల్యూఎంసీసీతో ముగిసిన మ్యాచ్ లో మహబూబ్‌నగర్ జట్టు 483 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన మహబూబ్‌నగర్ జట్టు 79.4 ఓవర్లలో 658 పరుగుల భారీస్కోరు సాధించింది. గణేశ్ విజృంభణకు తోడు అబిద్ (69 బంతుల్లో 110; 13 ఫోర్లు, 6 సిక్సర్లు) కూడా సెంచరీతో చెలరేగాడు. పి. హర్షవర్ధన్ (49; 9 ఫోర్లు), కేశవులు (78; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ప్రత్యర్థి బౌలర్లలో టైటస్ 5 వికెట్లతో ఆకట్టుకున్నాడు. భారీ లక్ష్యఛేదనలో డబ్ల్యూఎంసీసీ తడబడింది. బుధవారం ఇన్నింగ్స్ ప్రారంభించిన డబ్ల్యూఎంసీసీ 49.4 ఓవర్లలో కేవలం 175 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. అక్షయ్ (28), హర్ష (28), శరత్ (28) పరవాలేదనిపించారు. మహబూబ్‌నగర్ బౌలర్లలో కయ్యుం 3, రుషేంద్ర 2 వికెట్లు దక్కించుకున్నారు.