తెలుగుదేశం పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? వరుస ఓటములతో పార్టీకి భవిష్యత్తు లేదని భావించిన నేతలు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారా? ఇప్పటికే కొందరు ఇతర రాజకీయ పార్టీలతో టచ్‌లోకి వెళ్లారా? 20 ఏళ్లుగా నాయకులకే దిక్కులేదు.. తమకేం భవిష్యత్తు ఉంటుందని కార్యకర్తలు కూడా పచ్చజెండాను వదిలేస్తున్నారా? జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే..ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. సార్వత్రిక సమరం తర్వాత నేతల వైఖరి, పార్టీ పరిస్థితి చూస్తే నాయకత్వ లేమితో ఆ పార్టీ కొట్టుమిట్టాడుతున్నట్లు స్పష్టమవుతోంది. దీంతో పాటు 20 ఏళ్లుగా జిల్లాలో పార్టీ పట్టు సాధించలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఇంకెన్నేళ్లు ‘సైకిల్’పై ప్రయాణం చేసినా రాజకీయ లక్ష్యాన్ని చేరుకోలేమని ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. రాయలసీమలో వైసీపీ అత్యంత బలంగా ఉన్న జిల్లాల్లో కర్నూలు ఒకటి. కడప జిల్లా తర్వాత అత్యంత బలమైన నాయకత్వం, కేడర్ ఆ పార్టీ సొంతం. ఇదే క్రమంలో టీడీపీ అత్యంత బలహీనంగా ఉండే జిల్లాల్లో కూడా కడప జిల్లా తర్వాత కర్నూలే! గత 20 ఏళ్ల ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే టీడీపీ పరిస్థితి జిల్లాలో దయనీయంగా ఉందన్న విషయం స్పష్టమవుతోంది. జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో గత నాలుగు ఎన్నికల్లో టీడీపీ అత్యధికంగా గెలిచింది 2009 ఎన్నికల్లో మాత్రమే. అది కూడా నాలుగు స్థానాలే. తక్కిన మూడు ఎన్నికల్లోనూ ఆ పార్టీకి ఘోరపరాభవం ఎదురైంది. ఈ ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో ఆ పార్టీ పరిస్థితి అట్టడుగుకు చేరింది. ఎన్నికల ఫలితాలు కొందరి రాజకీయ జీవితానికి ముగింపు పలకగా, మరికొందరు పార్టీ భవిష్యత్తుపై నమ్మకం కోల్పోయి ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. జిల్లాలో టీడీపీ ఈ స్థాయిలో దెబ్బతినడానికి కారణం ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాలతో పాటు నేతల తప్పులు కూడా కన్పిస్తున్నాయి. ఎన్నికలు ముగిసి ఐదు నెలలు దాటినా ఇప్పటి వరకూ కొంతమంది నేతలు చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. మరికొంతమంది పార్టీ వీడి ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. భూమా, కేఈ, కోట్ల కుటుంబాలు పూర్తిగా బలహీనపడటం, టీజీ వెంకటేశ్ లాంటి వ్యక్తులు స్వార్థరాజకీయాలతో రెండు పడవలపై ప్రయాణం చేస్తుండడంతో టీడీపీ భవిష్యత్తు అంధకారంగా మారింది.
విశ్వాసం కోల్పోయిన కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి జిల్లాలో రాజకీయంగా గౌరవం ఉండేది. అయితే.. ఇటీవలి ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరారు. ఈ పరిణామాన్ని కోట్ల వర్గంతో పాటు జిల్లా ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోయారు. ఎన్నికల్లో ప్రకాశ్‌రెడ్డితో పాటు ఆయన సతీమణి సుజాతమ్మను కూడా ఘోరంగా ఓడించారు. వారు కనీసం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగి ఉంటే గౌరవం ఉండేది. కానీ కొన్నేళ్లుగా వైరం నడిపిన కేఈ కుటుంబం ప్రయాణిస్తున్న ‘సైకిల్’లోనే వీరు ఎక్కడంతో ప్రజల విశ్వాసం కోల్పోయారు. ఆయన వర్గంగా ఉన్న వారు కూడా ఇతర పార్టీల్లో చేరిపోయారు. ఇప్పుడు కోట్ల కుటుంబం రాజకీయంగా చెల్లని కాసైపోయిందని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. మరోపక్క టీడీపీలో కేఈ కృష్ణమూర్తి బలమైన నేతగా ఉండేవారు. గత ఐదేళ్లు టీడీపీలో కొనసాగినా, చంద్రబాబు కేఈకి ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో తన కుమారుడిని కూడా టీడీపీని వీడి ప్రత్యామ్నాయం చూసుకోవాలని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. శ్యాంబాబు పార్టీని వీడితే కేఈ ప్రభాకర్ కూడా అదే దారిలో నడిచే అవకాశం ఉంది. ఇదే జరిగితే డోన్, పత్తికొండలో టీడీపీకి గడ్డుకాలమే. ఆదోనిలో మీనాక్షినాయుడుకు వయసైపోవడంతో ఆయన రాజకీయ జీవితం ముగిసినట్లే!