తాజాగా తెలుగు సినీరచయితల సంఘం 25సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా రజతోత్సవ వేడుకలు ఆదివారం ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో జరిగాయి. ఈ వేడుకలకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. సీనియర్ రచయితలైన ఆదివిష్ణు, రావికొండలరావు, సత్యానంద్, భువనచంద్రలకు జీవిత సాఫల్య పురస్కారాలను చిరంజీవి చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ఇక్కడికి రావడం అత్యంత సంతోషం, సంతృప్తికరం. సినీ పరిశ్రమలో దర్శక నిర్మాతల తర్వాత నేను గౌరవించిచేది, సన్నిహితంగా వుండేది రచయితలతోనే.. పరుచూరి బ్రదర్స్, సత్యానంద్‌గారికి అది తెలిసిందే. అసలు రచయితలే లేకపోతే మేంలేం అనేది వాస్తవం.. మొన్నీమధ్య దీపావళికి మోహన్‌బాబు ఇంటికి వెళ్ళాం.. అక్కడ అందమైన వెండి సింహానం వుంది. అది చూడగానే సత్యానంద్‌ను రాఘవేంద్రరావు కూర్చోపెట్టారు. దూరం నుంచి చూస్తున్న నాకు.. కరెక్టేకదా, ఆ స్థానాన్ని అలంకరించే అర్హుడు ఆయనే అనిపించింది.
అది ఒక్క సత్యానంద్నే కాదు రచయితలందరినీ గౌరవించినట్టు అని ఫీలయ్యాను. అందరం ఆయన దగ్గరకు వెళ్లి ఫొటో దిగాం. సత్యానంద్ గారిని కాలుమీద కాలేసుకోమనిచెప్పాం. ఆయన స్వభావం కాకపోయినా మేం చెప్పామని ఆయన వేసుకున్నారు. ఆసమయంలో మోహన్ బాబు ఎప్పుడూ ఏదో గెలుకుతూ ఉంటాడు కదా ఆయన.. ఏమయ్యా.. రాఘవేంద్రరావును నిలబెట్టి, సత్యానంద్ గారికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు.. ఆయన దర్శకేంద్రుడయ్యా.. ఆయన్ని అవమానిస్తావా అన్నారు.. అయితే నేను వెంటనే.. రాఘవేంద్రరావు అమరశిల్పి జక్కన్న, ఉలి, సుత్తి ఆయన చేతిలోఉంటుంది. ఆయన దేన్ని చెక్కాలి..? ఒక శిల ఉండాలి కదా..? ఆ శిలేనయ్యా సత్యానంద్ గారు అన్నాను.. సత్యానంద్ మనసులో నుంచి వచ్చిన కథను రాఘవేంద్రరావు అందంగా చెక్కుతారు. రాఘవేంద్రరావును తక్కువచేయటం కాదయ్యా.. సత్యానంద్ లాంటి రచయితలను గౌరవించుకోకపోతే మనకు మనుగలేదని గుర్తుచేస్తున్నాను అన్నాను. అని చెప్పారు..ఇదంతా సరదాగా జరిగిందని నవ్వుతూ చెప్పారు చిరంజీవి. ఆయన మాట్లాడుతున్నప్పుడు మోహన్ బాబు కూడా అక్కడే ఉంది అందరూ నవ్వుకున్నారు.. అయితే కొన్ని దశాబ్దాలుగా చిరంజీవి మోహన్ బాబు ఇండస్ట్రీలో ఉంటూనే ఒకరినొకరు టామ్ అండ్ జెర్రీ లాగా ఏడిపించుకుంటూ ఉంటారు అనే విషయం అందరికీ తెలిసిందే.