తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్రంలోని మహిళలకు శుభవార్తను ప్రకటించినట్లైంది.రాష్ట్ర వ్యాప్తంగా మహిళా స్వయం సహాయక సంఘాలు పలు బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలకు సంబంధించిన వడ్డీను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న బుధవారం విడుదల చేసింది.
ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ వడ్డీకి సంబంధించి మొత్తం రూ. 618.92 కోట్లను విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులను జారీ చేశారు. దీంతో రాష్ట్రంలోని 4.6 లక్షల మహిళా సంఘాల్లోని 46 లక్షల మంది మహిళలకు వడ్డీ అందనున్నది.
పోయిన ఏడాది ఆగస్టు 14న రూ.930 కోట్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి సెర్చ్ ఖాతాల్లో జమచేసింది.తాజాగా అప్పటి నుంచి ఇప్పటివరకు ఉన్న మొత్తం చెల్లించాల్సిన వడ్డీని విడుదల చేసింది. ఈ మొత్తం సెర్చ్ ఖాతా నుంచి బ్యాంకులకు,బ్యాంకుల నుంచి మహిళా సంఘాల ఖాతాలకు బదిలీ కానున్నది. త్వరలోనే సంఘాల వారీగా రాయితీ వడ్డీని ఖాతాల్లో జమచేస్తామని సెర్చ్ అధికారులు తెలిపారు.