అన్నివర్గాల ప్రజలు నిత్యం ఆహారంలో భాగంగా వినియోగించే ఉల్లి ధర భారీగా పెరిగింది. ఉల్లి కొస్తుంటే కన్నీళ్లు వస్తాయి..కానీ ఇప్పుడు కొనాలంటే కన్నీళ్ళు వస్తున్నాయి. పది ఇరవై కాదు ఏకంగా వందకు పెరిగింది. ప్రస్తుతం ఉల్లి అంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. కానీ ఉల్లి వాడకం వంటల్లో తప్పనిసరిగా ఉండటంతో ధర ఎక్కువైనా కూడా కొనడం తప్పడం లేదంటున్నారు. క్వింటాలు ఉల్లిపాయలు రూ. 5,000 నుంచి రూ. 8,000 వరకు పలుకుతున్నాయని వ్యాపారులు చెప్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఉల్లి పంట ప్రభావితమైంది. వర్షాలతో పంట దెబ్బతినడంతో… ఉల్లి దిగుబడి తగ్గింది. దీంతో… మార్కెట్లో ఉల్లి డిమాండ్ పెరగటం… అందుకు తగ్గ సరఫరా లేకపోవటంతో ధరలు భారీగా పెరగటం మొదలైంది. అక్టోబరులో ఉల్లి ధరలు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ మళ్లీ పెరగుతుండటం వినియోగదారులపై భారం పడుతోంది.
