అనంతపురం జిల్లా గొరవనహళ్లికి చెందిన ఇద్దరు వ్యక్తులను అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. పరిగి ఎస్‌ఐ శ్రీనివాసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు గొరవనహళ్లికి చెందిన దాసరి నక్కల వెంకటస్వామి కుమారుడు దాసరి మురళి(32) ఆటో నడుపుకోవడంతో పాటు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని జీవిస్తున్నాడు. వరుసకు మామ అయిన దాసరి ఈశ్వరప్ప(52)తో కలిసి సోమవారం సాయంత్రం కర్ణాటక ప్రాంతం విట్లాపురానికి వెళ్లి మద్యం సేవించి స్వగ్రామానికి టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై తిరుగు పయనమయ్యారు. రాత్రి సమయంలో మోదా గ్రామం దాటిన తరువాత.. అప్పటికే గ్రామ శివారులో పొంచి ఉన్న కొందరు దుండగులు వీరి ద్విచక్రవాహనాన్ని అడ్డగించారు. కళ్లల్లో కారంపొడి చల్లి ఇనుపరాడ్డుతో ఇద్దరిపై దాడి చేశారు. తలలపై బాదడంతో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. ఎలాంటి ఆధారాలు చిక్కకుండా చనిపోయిన ప్రాంతంలో మృతదేహాలపై, ఈడ్చుకెళ్లిన ప్రదేశం అంతటా కారంపొడి చల్లి దుండగులు పరారయ్యారు.
