ఏపీలో 2019 సార్వత్రిక ఎన్నికల వేడి ఇంకా తగ్గలేదు. అప్పుడే మళ్ళీ ఎన్నికల నగరా మోగింది.అన్ని పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు మరో మూడు నెలల్లో జరిపే అవకాశం కనిపిస్తోంది. హైకోర్టు ఆదేశాల మేరకు మరో మూడు నెలల్లో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. స్థానిక సంస్థల ఎన్నికలపై దాఖలైన పిటిషన్ పై ఏపీ ప్రభుత్వం ఈ విధంగా తన సమాధానం తెలిపింది. మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు అడ్వకేట్ జనరల్ శ్రీరాం హైకోర్టుకు తెలిపారు. గడువు ముగిసి నెలలు గడుస్తున్నా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదని విజయవాడకు చెందిన ఎ.వేణుగోపాలకృష్ణ మూర్తి హైకోర్టులో పిల్ వేశారు. దీనితో మంగళవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిల్ పై విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ శ్రీరాం హైకోర్టుకు తెలిపారు.
ఇకపోతే ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నట్టు పురపాలక పట్టణాభివృద్ధి మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. బీసీలకు 34 శాతం ఎస్సీలకు 19.08 ఎస్టీలకు 6.77 శాతం అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అయితే రిజర్వేషన్ల పై రాజ్యంగపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది అని తెలుస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించింది. ప్రస్తుతం అధికారులు మొత్తం వాటిపైనే దృష్టి పెట్టారు. అయినప్పటికీ మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపి తీరాలని వైసీపీ ప్రభుత్వం అనుకుంటుంది.