ఏపీలో లాంగ్ మార్చ్ విజయవంతం అయిందని ఆనందంలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు, జనసైనికులకు ఆ పార్టీ మాజీ నేత, అద్దేపల్లి శ్రీధర్ షాక్ ఇచ్చారు. ఇవాళ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో అద్దేపల్లి వైసీపీలో చేరారు. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు జనసేన పార్టీ తరపున స్పోక్స్ పర్సన్‌గా అద్దేపల్లి శ్రీధర్ రాణించారు. మంచి వక్త, విషయ పరిజ్ఞానం, సమకాలీన సామాజిక, రాజకీయ అంశాలపై లోతైన అవగాహన మెండుగా ఉన్న అద్దేపల్లి శ్రీధర్ టీవీ ఛానళ్ల చర్చా కార్యక్రమాల్లో ఎంతో హుందాగా, అర్థవంతంగా మాట్లాడేవారు. జనసేన తరపున తన వాయిస్‌ను బలంగా వినిపించేవారు. జనసేన పార్టీ సిద్ధాంతాలను, పవన్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే ఎన్నికల సమయంలో చంద్రబాబుకు అనుకూలంగా పవన్ వ్యవహరించిన తీరును విబేధించిన అద్దేపల్లి..ఎన్నికలు ముగియగానే జనసేన పార్టీకి రాజీనామా చేశారు. గత 5 నెలలుగా ఏ పార్టీలో చేరకుండా క్రియాశీలక రాజకీయాలకు విరామం ఇచ్చిన అద్దేపల్లి ..తాజాగా వైసీపీలో చేరారు. సీఎం జగన్ పాలన ప్రజాహితంగా సాగుతుందని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకువెళ్లాలనే భావనతోనే అద్దేపల్లి వైసీపీలో చేరినట్లు తెలుస్తోంది. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కీలక నేతగా ఎదిగిన అద్దేపల్లి శ్రీధర్ వంటి నాయకుడు వైసీపీలో చేరడం జనసేన పార్టీ శ్రేణులకు ఒకింత షాక్ అనే చెప్పాలి.
